Bathukamma Special 2024 : బతుకమ్మ ప్రసాదాలు.. 9 రోజులు.. ఏ రోజు ఏ ప్రసాదం అంటే..!

Bathukamma Special 2024 : బతుకమ్మ ప్రసాదాలు.. 9 రోజులు.. ఏ రోజు ఏ ప్రసాదం అంటే..!

ఆడుతూ పాడుతూ  సాగే బతుకమ్మను  ఆ నీళ్లలోకి సాగనంపే ముందు గౌరమ్మగా భావిస్తూ పూజ చేస్తారు. ఈ పూజకు తమ ఇంటి పాడిపంటలనే నైవేద్యంగా పెడతారు. పాటలు పాడుతూ ఆడే బతుకమ్మ ఆటలో అలసిన వారికి శక్తి, ఆనందం ఇచ్చేందుకు రుచికే కాకుండా బలానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. బతుకమ్మ తొమ్మిది రోజుల సంబురం. కానీ ఆరో రోజు ఆడరు. ఆరో రోజుని 'అర్రెం' అంటారు. తొమ్మిది రోజులూ బతుకమ్మ ఆడితే ఇంటి పనులు కుంటుపడతాయని ఆరో రోజున విశ్రాంతి తీసుకుంటారని 'బతుకమ్మ' పాటలలో స్త్రీల మనోభావాలు' పుస్తకంలో పరిశోధకురాలు తిరునగరి దేవకీదేవి అభిప్రాయపడ్డారు.

బతుకమ్మలు తొమ్మిది రోజులపాటు అని అంటారు. కానీ, ఆరోరోజు బతుకమ్మను  పేర్చరు. బతుకమ్మకు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పలహారాలు సమర్పిస్తారు. ఆరో రోజుని  అలకల బతుకమ్మ' అని కూడాఅంటారు.బతుకమ్మ ఆడిన తర్వాత ఎక్కువగా సత్తుపిండి మలిద ముద్దలను ప్రసాదంగా పెడతారు. మక్క పేలాల్లో బెల్లం లేదా చక్కెర కలిపిన మిశ్రమాన్ని 'సత్తుపిండి ' అంటారు. జొన్న లేదా సజ్జ రొట్టెలు, బెల్లం కలిపి దంచిన మిశ్రమాన్ని 'మలిద ముద్దలు' అంటారు.


మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు బతుకమ్మ ఆడిన తర్వాత నైవేద్యం పెడతారు. ఆ తర్వాత అందరికీ ఆ ప్రసాదం పంచి పెడతారు. ఊళ్లలో ఎక్కువ మంది ప్రతి రోజూ (ఇంట్లో ఉన్న అవకాశాలను బట్టి) ఒకే విధమైన ప్రసాదం ఇచ్చే సంప్రదాయం ఉంది. కాస్త డబ్బు ఉన్న వాళ్లు రోజుకో తీరుగా ప్రసాదం ఇస్తారు. అలా రోజుకో తీరుగ ప్రత్యేకమైన ప్రసాదం ఇచ్చే సంప్రదాయం వచ్చింది.

1వ రోజుఎంగిలి పూల బతుకమ్మ

నువ్వులు, బియ్యప్పిండి, సూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. కొంతమంది మొక్కజొన్న లేదా గోధుమ పిండిలో బెల్లంగాని, పంచదారగాని కలిపి సత్తుపిండిని తయారుచేస్తారు. ఈ సత్తు పిండితో పాటు వక్కలు, తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు.

2వ రోజు అటుకుల బతుకమ్మ

నీటిలో నాన బెట్టిన చప్పిడి పప్పుకి బెల్లం, అటుకులు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. బతుకమ్మ ఆటలో అలసిన వారికి అటుకుల నుంచి తక్షణమే శక్తి లభిస్తుంది. బెల్లంలో ఉండే ఐరన్, పప్పులో ఉండే ప్రొటీన్లు దేహాన్ని దృఢంగా చేస్తాయి.

3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ

నీటిలో ఉడికించిన శెనగపప్పుకి బెల్లం, పాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు.

4వ రోజు  నాన బియ్యం బతుకమ్మ

 నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా ఇస్తారు.

5వ రోజు అట్ల బతుకమ్మ

నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా ఇస్తారు.అట్లను ఈ రోజు ప్రసాదంగా ఇస్తారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా విసిరి పిండి చేస్తారు. నానబెట్టిన మినపప్పు రుబ్బి ఒక రోజు ముందే ఈ రెంటినీ కలిపి ఉంచుతారు. ఆ తర్వాత రోజు అట్లు పోసి ప్రసాదంగా పెడతారు.

6వ రోజు అలిగిన బతుకమ్మ 

ఈ రోజు బతుకమ్మ ఆడరు. కొన్ని చోట్ల బతుకమ్మ ఆడతారు. కానీ ప్రసాదం ఇవ్వరు.

7వ రోజు వేపకాయ బతుకమ్మ 

సకినాల పిండిని వేపకాయ పరిమాణంలో చిన్న చిన్న ముద్దలుగా చేస్తారు. వీటిని నూనెలో వేగించి ప్రసాదంగా ఇస్తారు. కొంత మంది పప్పు, బెల్లం కలిపి కూడా ఇస్తారు.

8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ

బిల్లాన్ని మెత్తగా దంచుతారు. ఈ బెల్లంలో నువ్వులు కలిపిన తర్వాత వెన్న కలుపుతారు. వెన్న లేకపోతే నెయ్యి ఉపయోగిస్తారు. మూడింటినీ బాగా కలిపిన తర్వాత ముద్దలు చేస్తారు. ఈ వెన్న ముద్దలను నైవేద్యంగా పెడతారు.

9వ రోజు సద్దుల బతుకమ్మ

ఐదు రకాల పద్దులను నైవేద్యంగా పెడతారు. అందుకే ఇది సద్దుల బతుకమ్మ, దద్దోజనం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పుట్నాలను పొడి చేసి అన్నంతో పద్దులు కలుపుతారు.

• బియ్యప్పిండితో గాని సజ్జపిండితో గాని రొట్టెలు కాలుస్తారు. వేడివేడి రొట్టెలకు పంచదార లేదా బెల్లం కలిపి దంచుతారు. ఈ పొడిని ముద్దలు చేస్తారు. వీటిని 'మలిద ముద్దలు' అంటారు.

• మలిదముద్దలు, పొడుల సద్ది, పెరుగుసద్ది, పులిహోరతో కలిపి మొత్తం ఐదు నుంచి తొమ్మిది రకాల సద్దులను నైవేద్యంగా ఇస్తారు.

 

v6 వెలుగు