బతుకమ్మ వాగు బ్రిడ్జికి ముప్పు ..నిరుడు భారీ వరదలతో తెగిపోయిన అప్రోచ్​రోడ్డు

బతుకమ్మ వాగు బ్రిడ్జికి ముప్పు ..నిరుడు భారీ వరదలతో తెగిపోయిన అప్రోచ్​రోడ్డు
  • గతేడాది తెలంగాణ, మహారాష్ర్టలకు స్తంభించిన రాకపోకలు 
  • టెంపరరీగా రిపేర్లు చేసి చేతులు దులుపుకున్న ఆఫీసర్లు 
  • గట్టి వానలు పడితే మళ్లీ అప్రోచ్ రోడ్డు తెగిపోయే ప్రమాదం 
  • తుతుంగ వాగు, పాలవాగు అప్రోచ్ రోడ్లదీ అదే పరిస్థితి 

చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్​మండలంలోని చింతలపల్లి వద్ద గల బతుకమ్మ వాగు బ్రిడ్జికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  నిరుడు జులై, ఆగస్టు నెలలో కురిసిన కుండపోత వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహించాయి.  చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని పలు ఊర్లు నీట మునిగాయి. వివిధ గ్రామాలకు పోయే రోడ్లు తెగిపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ తరుణంలో నిజామాబాద్ నుంచి జగ్ధల్ పూర్ వెళ్లే  నేషనల్​హైవే 63పై చెన్నూర్​మండలంలోని చింతలపల్లి బతుకమ్మ వాగు పొంగి పొర్లింది. వరద ఉదృతికి బ్రిడ్జికి ఇవతలి వైపు అప్రోచ్ రోడ్డు దాదాపు పది మీటర్లు పొడవునా తెగిపోయింది. దీంతో తెలంగాణ, మహారాష్ర్టల మధ్య రవాణా స్తంభించిపోయింది.  సిరొంచ, కాళేశ్వరంతో పాటు కోటపల్లి మండలంలోని గ్రామాలకు పదిహేను రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. 

వరదలు తగ్గిన తర్వాత అక్కడ అప్రోచ్​ రోడ్డుకు రాళ్లు, ఇసుక బస్తాలు, మట్టి వేసి  టెంపరరీగా రిపేర్లు చేశారు. సైడ్లకు ఐరన్​గ్రిల్స్, హెచ్చరిక బోర్డులను పెట్టి ఆర్అండ్ బీ అధికారులు చేతులు దులుపుకున్నారు. సంఘటన జరిగి సంవత్సరం గడిచినా ఇప్పటివరకు పర్మినెంట్ చర్యలు తీసుకోలేదు. మళ్లీ వర్షాకాలం రావడంతో నిరుటి పరిస్థితిని తల్చుకొని ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే టెంపరరీ రోడ్డు మళ్లీ తెగిపోయి రాకపోకలు స్తంభించిపోయే అవకాశం ఉంది. రోడ్డు వెంట కొంతదూరం కరకట్ట కడితేనే మళ్లీ రోడ్డు తెగిపోకుండా ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఈ బ్రిడ్జిపై అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల మరోసారి జనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రానున్న వరదలకు రోడ్డు తెగిపోకుండా పర్మినెంట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.  

   కోటపల్లి మండలంలోని తుతుంగ వాగు బ్రిడ్జి అప్రోచ్​రోడ్డు కూడా వరదలకు కొట్టుకుపోయే ప్రమాదం  ఉంది. కిందటి ఏడాది వరదలకు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ రూ. కోట్ల ఖర్చుతో ఆగమేఘాల మీద హైలెవల్​బ్రడ్జి నిర్మించినప్పటికీ అప్రోచ్​రోడ్డు వరదలను తట్టుకునే పరిస్థితి లేదు. 

ALSOREAD:చెరువులో వేల సంఖ్యలో చేపలు మృతి

చెన్నూర్  నుంచి కోటపల్లికి వెళ్లే రోడ్డుపై పాలవాగు బ్రిడ్జి దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది. మొన్న కురిసిన ఒక్క వానకే అప్రోచ్ రోడ్డు మొరం కొట్టుకుపోయింది. ఇక భారీ వర్షాలు కురిస్తే రోడ్డు మొత్తం తెగిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పై రెండు బ్రిడ్జిల దగ్గర అప్రోచ్​రోడ్లు వరదలకు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.