ధరణి పేరుతో ల్యాండ్ మాఫియా

  • అన్ని రంగాల్లోనూ బీ‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ సర్కారు ఫెయిల్: భట్టి

సూర్యాపేట, వెలుగు: బీఆర్ఎస్  ప్రభుత్వ పాలన లో రాష్ట్రం అన్ని రంగాల్లో ఫెయిలైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్  చేతిలో రాష్ట్రం నలిగిపోతున్నదని, ధర ణి పేరిట  మాఫియా రాజ్యమేలుతున్నదని ఆయన ఫైర్​ అయ్యారు. ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వంద సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యాపేటకు చేరిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేండ్లలో  సాధించింది శూన్యం అని విమర్శించారు. సీఎం కేసీఆర్  నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల దాకా రాష్ట్ర సంపదను లూటీచేసి దాచుకున్నారని మండిపడ్డారు.

గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్  నేతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయకులు రాజకీయాల కోసం వారి సొంత ఆస్తులను పోగొట్టుకున్నారు తప్ప కూడబెట్టుకోలేదని గుర్తుచేశారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ఫలితమే అని పేర్కొన్నారు. ‘‘ఎస్సారెస్పీ నుంచి జిల్లాకు సాగునీరు మేము తవ్విన కాల్వల ద్వారా వస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్  నీళ్లని సంబురాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్  ఇచ్చిన నీటితో సాగవుతున్న భూమి తప్ప జిల్లాలో ఒక్క అదనపు ఎకరం కూడా కేసీఆర్  ప్రభుత్వ హయాంలో పెరగలేదు. జిల్లాకు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తునట్లు బీఆర్ఎస్  నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే మంత్రి జగదీశ్  రెడ్డి నిరూపించాలి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కఆదు.. తిప్పిపోతల ప్రాజెక్ట్ అని ఆయన ఎద్దేవా చేశారు. జిల్లా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా పదేళ్లుగా యాదాద్రి పవర్  ప్రాజెక్టు పూర్తి కాలేదు. బీఆర్ఎస్  ప్రభుత్వం తన వైఫల్యాలు  కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నది” అని భట్టి వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్  రాజకీయ, ఆర్థిక లావాదేవీల కోసం కలిసి పనిచేస్తున్నాయని, ఆ రెండు పార్టీల బంధాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాగా, భట్టి పీపుల్స్ మార్చ్  పాదయాత్రకు తెలంగాణ  బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్  మద్దతు ప్రకటించారు.

150 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం: బండ్ల గణేశ్ 

150 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్  జెండా ఎగురవేస్తామని సినీ నిర్మాత బండ్ల గణేశ్  అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఆయన మద్దతు పలికి మాట్లాడారు. కర్నాటక నుంచి కాంగ్రెస్ హుద్ హుద్  తుఫాన్ మొదలైంద న్నారు. తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆదిలాబాద్ నుంచి అలుపెరగకుండా భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని, కాంగ్రెసే  లేకుంటే బ్రిటిష్ వాళ్ల కింద బానిసలుగానే ఉండేవాళ్లమన్నారు. సోనియా గాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు.