ఔటా..? నాటౌటా..? ఇలాంటి ఘటనల్లో క్రికెట్ రూల్స్ ఏం చెప్తున్నాయి

ఔటా..? నాటౌటా..? ఇలాంటి ఘటనల్లో క్రికెట్ రూల్స్ ఏం చెప్తున్నాయి

బౌలర్ బంతిని విసిరినప్పుడు అది వికెట్‌ను తగిలిందా ఔటివ్వాలి. ఇది మనకు తెలిసిన నియమం. ఎందుకంటే గల్లీ క్రికెట్‌లో బెయిల్స్ ఉండవు. ఒకవేళ బెయిల్స్ ఉన్నా బంతి వికెట్‌ను గిరాటేస్తే ఔటివ్వాల్సిందే. లేదంటే అంపైర్‍కు మాములుగా ఉండదు. కానీ, ఓ మ్యాచ్‌లో బంతి మిడిల్ స్టంప్ ను తగిలినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. పోనీ నో బాల్ విసిరాడు అంటారా! అదీ లేదు.  మరెందుకంటే.. క్రికెట్ నిబంధనలు అలా ఉన్నాయి కనుక. ఈ ఘటన ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఏసీటీ ప్రీమియర్ క్రికెట్ టోర్నీలో చోటుచేసుకుంది. 

ఏసీటీ ప్రీమియర్ క్రికెట్ టోర్నీలో భాగంగా గినిండెరా క్రికెట్ క్లబ్, వెస్ట్ డిస్ట్రిక్ట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గినిండెరా బౌలర్ ఆండీ రేనాల్డ్స్ తన బౌలింగ్ లో వెస్ట్ డిస్ట్రిక్ట్ ఓపెనర్ మాథ్యూ బొసుస్టౌను క్లీన్ బౌల్డ్ చేశాడు. బంతి తగిలిన వెంటనే మిడిల్ స్టంప్స్ పక్కకు ఒరిగింది. కానీ స్టంప్స్ పై ఉన్న బెయిల్స్ మాత్రం చెక్కు చెదరలేదు. దీనిని గమనించని బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో సహచర ఆటగాళ్లతో కలిసి ఎగిరి గంతేశాడు. బ్యాటర్ కూడా పెవిలియన్ వైపు దారి మళ్లాడు. కానీ అంతలోనే బెయిల్స్ అలాగే ఉండటం చూసి తిరిగి వెనుకకు వచ్చాడు. 

తలపట్టుకున్న అంపైర్లు

నిర్ణయాన్ని ఎవరికి అనుకూలంగా ఇవ్వాలో తెలియక అంపైర్లే తలలు పట్టుకున్నారు. వారు కూడా గల్లీ అంపైర్లు కావడంతో క్రికెట్ రూల్ బుక్ చదివి మరీ తమ నిర్ణయాన్ని నాటౌట్ అని ప్రకటించారు. దీంతో చేసేదేమీ లేక ఆండీ రేనాల్డ్స్ తన బౌలింగ్‌ను అలానే కొనసాగించాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

క్రికెట్ రూల్స్ ఏం చెప్తున్నాయి

క్రికెట్ రూల్స్ రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ప్రకారం.. "బంతి స్టంప్స్‌ను తగిలినప్పుడు వాటిపై ఉన్న రెండు బెయిల్స్‌లో ఒకటైనా కిందపడాలి.. లేదంటే కనీసం ఒక్క స్టంప్ గ్రౌండ్ లోపలి నుంచి బయటకు రావాలి.." అలా అయితేనే ఔటిస్తారు. 

క్రికెట్ రూల్ 29.22 ప్రకారం.. "బెయిల్ కదిలినంత మాత్రాన అది పడిపోయినట్లు కాదు. కిందపడితేనే ఔట్ అని క్లుప్తంగా పొందుపరిచారు. అయితే, బెయిల్ కింద పడకుండా రెండు స్టంప్స్ మధ్య ఇరుక్కుపోతే ఔట్.." అని రాశారు.

Also Read:- ఏం గుండెరా వీడిది.. పరీక్షలో అన్ని ప్రశ్నలకు ధోని పేరే సమాధానం