న్యూఢిల్లీ: గ్రోయిన్ ఇంజ్యురీ (స్పోర్ట్స్ హెర్నియా)తో బాధపడుతున్న ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు బుధవారం రాత్రి మ్యూనిచ్ (జర్మనీ)లో సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న సూర్య మొదట చికిత్స తీసుకున్నా.. హెర్నియా తీవ్రం కావడంతో ఆపరేషన్ తప్పలేదు. రెండు నెలల కిందటే సూర్యకుమార్ చీలమండకు ఆపరేషన్ జరిగింది.
‘నా ఆరోగ్యంపై శ్రద్ధ చూపెట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. త్వరలోనే మీ ముందు ఉంటానని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఆపరేషన్ బాగా జరిగింది’ అని సూర్య ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి మధ్యలో అతను బ్యాట్ పట్టే చాన్స్ ఉంది. మార్చి మూడో వారంలో మొదలయ్యే ఐపీఎల్ వరకు సూర్య పూర్తి స్థాయిలో కోలుకుంటాడని ఆశిస్తున్నారు.