- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నల్గొండ అర్భన్, వెలుగు : మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డితో నల్లగొండ జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా బుధవారం కనగల్మండలానికి చేరుకున్న ఆయన మండల కేంద్రంలో కార్నర్‌మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమకు భవిష్యత్తే లేకుండా పోయిందని ప్రజలందరూ వాపోతున్నారని చెప్పారు.
ఉద్యోగాలు రాలేదని, ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వట్లేదని, కొత్త పింఛన్ రావట్లేదని, ఉపాధి పనుల పైసలు రావట్లేవని ఇలా ప్రతిఒక్కరూ నిరాశతో ఉన్నారన్నారు. ఒకవేళ ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారని భయపడే రోజులు వచ్చాయన్నారు. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడమంటే నా పంచె, నా గోశి గురించి సుఖేందర్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని, కానీ, కేసీఆర్ కుటుంబం, ఇక్కడున్న జగదీశ్వర్ రెడ్డి కుటుంబం, గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ ఆస్తులు మాత్రం వేల కోట్లకు పెరిగాయన్నారు.