- హుజురాబాద్ లో కౌశిక్ కు సీనియర్లు దూరం
- చొప్పదండి, మానకొండూరులో ఆధిపత్య పోరు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ లో రోజురోజుకూ ఇంటిపోరు పెరుగుతోంది. కరీంనగర్లో మాజీ మేయర్సర్దార్రవీందర్సింగ్ వ్యవహారం మంత్రి గంగుల కమలాకర్‌కు తలనొప్పిగా తయారైంది. అటు హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డితో సీనియర్లు.. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇక మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో అయితే ఏకంగా ఎమ్మెల్యే సీట్లకే ఎసరు పెడుతూ వర్గాలు తయారవుతున్నాయి. గ్రామాల్లో ఆశావహుల వాల్ రైటింగ్ లు.. ఫ్లెక్సీలతో ఎమ్మెల్యేలకు ఇంటిపోరు తప్పడం లేదు.
మంత్రి వర్సెస్ మాజీ మేయర్
కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ మేయర్ రవీందర్ సింగ్ కొరకరాని కొయ్యగా మారారు. రవీందర్సింగ్గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి మంత్రికి వ్యతిరేకంగా జట్టుకట్టారు. అనంతర పరిణామాలతో మళ్లీ సీఎం కేసీఆర్ తో ఢిల్లీ, బిహార్ పర్యటనలకు వెళ్లారు. సీఎంకు దగ్గరవుతుండటంతోనే మంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సింగ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రవీందర్సింగ్అన్న కూతురు, కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ భర్త సోహన్ సింగ్ ఆడియో కలకలం రేపింది. డివిజన్ లో అభివృద్ధి పనులను మంత్రి కావాలనే ఆపేస్తున్నారని సోహన్ ఆరోపణలు చేశారు. దీంతో డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి మాజీ మేయర్ సహా, కార్పొరేటర్ కమల్జిత్కౌర్, ఆమె భర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని గంగులకు, బోయినపల్లి వినోద్ కుమార్ కు విన్నవించారు. సోహన్ సింగ్ రోడ్డు తవ్వించారంటూ మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. ఇదే ఘటనలో ముగ్గురు మున్సిపల్ఉద్యోగులను కమిషనర్ సస్పెండ్ చేశారు. గతంలోనూ కమల్జిత్ కౌర్ ఖాళీ బిందెతో వార్డులో నీళ్లురావడం లేదని మున్సిపల్ మీటింగ్‌లో నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల టైం లోని వివాదంపై రవీందర్ సింగ్ పై ఇటీవల కేసు నమోదైంది. రెండు రోజుల కింద పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్, ఆమె భర్తకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు గతంలో లైబ్రరీ చైర్మన్‌గా పనిచేసిన రవీందర్ రెడ్డి మరోసారి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. మంత్రి సన్నిహితుడు పొన్నం అనిల్‌ను పదవి వరించింది. అయినా రవీందర్ రెడ్డి ఇటీవల లైబ్రరీలో జెండావిష్కరణ, చొప్పదండిలో లైబ్రరీ ప్రారంభోత్సవం చేయడంపై అనిల్ వర్గం ఆగ్రహంతో ఉంది.
టికెట్ల లొల్లి..
చొప్పదండి ఎమ్మెల్యే సీటు కోసం ఇప్పటినుంచే చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వీరంతా తమ ఆకాంక్షను సందర్భానుసారంగా ప్రకటిస్తున్నారు. రామడుగు మండలానికి చెందిన ఓ నేత ఇప్పటికే బహిరంగంగా చెబుతున్నాడు. ఇటీవల బోయినపల్లి బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే రవిశంకర్ ఫొటో లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ కు చెందిన నాయకుడు కంసాల శ్రీనివాస్ కూడా సీటుపై కన్నేశాడు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో వాల్ రైటింగ్ లు రాయించుకున్నాడు. అయితే పేరు కనిపించకుండా చెరిపేయడం చర్చానీయాంశంగా మారింది. లైబ్రరీ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి సైతం దూరంగానే ఉంటున్నారు. రెండోసారి పదవి పొడిగించకపోవడంపై ఎమ్మెల్యే హస్తం ఉందని చెబుతున్నారు. ఇక మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈసారి తనకే సీటు వస్తుందని ఆరెపల్లి ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు ఓరుగంటి ఆనంద్ వివిధ పనులు చేస్తూ జనాలకు దగ్గరవుతున్నారు.
సీనియర్స్ వర్సెస్ పాడి
హుజురాబాద్ లో నియోజకవర్గ ఇన్చార్జిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నా.. కౌశిక్‌రెడ్డే పెత్తనం చెలాయిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. పాడి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి పార్టీలో మొదటినుంచి ఉన్న నాయకులను దగ్గరికి రానీయడం లేదు. దీంతో సీనియర్లంతా ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇటు కౌశిక్ రెడ్డి పట్టించుకోక.. అటు గెల్లు వీరికి భరోసా ఇవ్వకపోవడంతో వీరంతా అయోమయంలో ఉన్నారు. ఈవిషయమై వారం కింద ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్వినోద్ కుమార్ వద్దకు చేరి మొరపెట్టుకున్నారు. ఇటీవల వీణవంక మండలంలో ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులపై కేసు పెట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ తండ్రి చనిపోతే కమలాపూర్‌లో మార్కెట్ కమిటీ స్థలాన్ని వినియోగించకుండా ఆఫీసర్లకు ఫోన్లు చేసి పర్మిషన్ రద్దు చేయాలని ఒత్తిడి చేయడంపై సొంత పార్టీ నేతలే ఖండించారు. అన్ని మండలాల్లో చేసిన పనులకు బిల్లులు చేసేటప్పుడు తనకు చెప్పాలని కౌశిక్‌రెడ్డి ఆఫీసర్లకు ఆర్డర్ వేయడంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒంటెత్తు పోకడలతో నియోజకవర్గంలో పార్టీలో క్యాడర్ మధ్య దూరం పెరుగుతోంది.