మిర్యాలగూడ,వెలుగు: సీపీఎంకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి తేల్చిచెప్పారు. మంగళవారం ‘సేవ్ కాంగ్రెస్.. సేవ్ మిర్యాలగూడ టికెట్’ నినాదంతో దామరచర్ల మండలం రాళ్ల వాగు తండా నుంచి మిర్యాలగూడ రాజీవ్ చౌక్ మీదుగా హనుమాన్ ఫ్లై వరకు5 వేల మంది పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్వే ఆధారంగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా సపోర్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
పొత్తు పేరిట సీపీఎంకు టికెట్ ఇస్తే తనతో సహా పార్టీ క్యాడర్ ఎవరి దారి వారు చూసుకుంటారని చెప్పారు. జనాల్లో ఆదరణ లేని సీపీఎంకు టికెట్ ఇచ్చి తప్పు చేయవద్దన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని గుర్తించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, ర్యాలీలో బత్తుల లక్ష్మారెడ్డి సొమ్మసిల్లి కింద పడి పోగా.. కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తరలించారు.