ఉద్యమం వల్లనే.. మళ్లొచ్చింది బతుకమ్మ

తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. మన రాష్ట్రంలో ఘనంగా జరిగే ఈ పండగ గురించి ప్రాచీన సాహిత్యంలో చాలా ప్రస్తావన ఉంది. ప్రజలు పాడుకునే పాటల్లో ఉంది. తరం నుండి తరానికి సాహిత్య పరంపర వస్తూనే ఉంది. జానపదులు పాడుకునే పాటల్లో బలంగా ఉంది. ఈ పండగ ఆశ్వయుజ పాడ్యమి నాడు మొదలై నవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమమే ఈ పండగకు తిరిగి ప్రాణం పోసింది. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఈ పండగను ఘనంగా చేసుకుంటున్నారు.

తెలంగాణ ప్రాంతాన్ని వివిధ రాజవంశాలు పాలించాయి. కాకతీయ రాజవంశ కాలం నుండే బతుకమ్మ పండగని ఆనవాయితీగా చేసుకుంటున్నారు. అదే విధంగా గోలకొండ కోట నుండి హైదరాబాద్ రాజధానిగా అయిన తర్వాత కూడా దీనిని బాగా జరుపుకునేవారు. ఇప్పటికీ గోలకొండలో కోట బోనాలు, దాని చుట్టూ ఉండే ఊళ్లల్లో బతుకమ్మలు పండగలు ఘనంగా జరుగుతాయి. రాజులు ముస్లీంలు అయినప్పటికీ ఈ ఆనవాయితీ  ప్రజలకు ఉంది. సర్ఫేఖాస్ ప్రాంతం అంతా బతుకమ్మలు ఆడేవారు. రాజధాని నగరం మెట్రోపాలిటన్ నుండి కాస్మోపాలిటన్​కి మారింది. ఇంతకుముందు హైదరాబాద్ నగరం విస్తరణ ఇంతగా లేదు. రాజేంద్ర నగర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, ఉప్పల్, సరూర్ నగర్, బాగ్ లింగంపల్లి వంటివి  అప్పట్లో గ్రామాలుగా ఉండేవి. మలక్​పేట్​కూడా ఓ చిన్న గ్రామమే. వ్యవసాయ పొలాలు నిన్నమొన్నటి వరకు ఉండేవి. ఊరికి ఒకటి రెండు చెరువులుండేవి. ఆ చెరువుల్లోనే బతుకమ్మలను నిమజ్జనం చేసేవారు. అట్లా వచ్చినవే నగరంలోని బతుకమ్మ కుంట, నల్లకుంట మొదలైనవి. మా చిన్నతనంలో అంబర్​పేట గ్రామంలోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసేవారు. బాగ్ లింగంపల్లిలో ఇప్పుడు సుందరయ్య విజ్జాన కేంద్రం ఉన్న ప్రాంతంలో అప్పట్లో పెద్ద చెరువు ఉండేది. అక్కడే బతుకమ్మల నిమజ్జనం జరిగేది. ఇట్లా నగరంలోని వందలాది చెరువులు బతుకమ్మల కోలాహలంతో ఉండేవి. ఆడ పడుచుల ఆట, పాటలతో మారుమోగేవి.

ఉత్తర తెలంగాణ గ్రామ గడీల్లో బతుకమ్మలు ఆడి, ఆ తర్వాత బజార్లలో ఆడేవారు. అట్లాగే నగరంలోని దేవిడీల్లో బతుకమ్మ ఆడిన తర్వాత చాలా వీధుల్లో మహిళలు బతుకమ్మలు ఆడేవారు. నాటి పల్లెసీమలే నగరం చుట్టూ ఉండేవి. వందేళ్ల కింద నగర జనాభా మూడు లక్షలు కూడా లేదు. అందువల్ల దాని చుట్టూ ఉండే గ్రామసీమల సంస్కృతి నగర ప్రజలపై చాలా ఎక్కువగా ఉండేది. పాలకులు ముస్లీంలు అయినాగానీ, పండగలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు చేసుకునేవారు. నగరం, గ్రామం కలగలిసిన తెలంగాణ జీవితం నాటి హైదరాబాద్ నగరానిది. ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారు. మరాఠీలు, గుజరాతీలు, కన్నడిగులు, తమిళులు ఇట్లా చాలా భాషల వారున్నారు. పాత హైదరాబాద్ ప్రాంతంలో… అంటే చార్మినార్ ప్రాంతంలోని షాలిబండ, చత్రీనాకా, లాల్ దర్వాజ వంటి ప్రాంతాల్లో ఈ పండగను బాగా జరుపుకునేవారు. ఎక్కువగా మూసీ నదిలో బతుకమ్మల నిమజ్జనం జరిగేది.

ఇటు హైదరాబాద్ నగరం, సర్ఫేఖాస్ ప్రాంతం, నల్గొండ జిల్లా, ఇటు మెదక్ జిల్లా గ్రామ సీమల ప్రభావం కూడా బతుకమ్మ పండగ ఉండేది. ఈ పండగ సందర్భంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ లేదా బొడ్డెమ్మలు ఆడేవారు. నవరాత్రుల సందర్భంగా ధనవంతులైన స్త్రీలు వెండికోలలతో కోలాటం ఆడే వారు. పేదవారు కర్రల కోలలతో ఆడేవారు. అదికూడ లేనివారు చప్పట్లతో పాటలు పాడుకుంటూ ఆడేవారు. దాండియా కోలాటం ఆడినట్లుగానే మన దగ్గర ఎప్పటి నుండో ఉనికిలో ఉంది. ఇప్పటికీ ఈ పండగ సందర్భంగా కోలాటాలు ఆడటం చూస్తూనే ఉన్నాం.

ఆంధ్ర, తెలంగాణ కలసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బతుకమ్మను పట్టించుకునేవారు లేకపోయారు.  కేవలం హైదరాబాద్​లోనే కాదు యావత్ తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ ప్రభావం ఉంటుంది. మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత దీనికో గుర్తింపు వచ్చింది. గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలు ఉద్యమించేలా చేసింది ఈ పండగ. కులమతాలకు అతీతంగా తెలంగాణ జరుపుకునే పండగ ఉది. ప్రకృతి, మహిళల, మానవ జాతి ఉన్నతిని కోరేదే బతుకమ్మ పండగ.

డాక్టర్ రత్నశ్రీ

అసిస్టెంట్ ప్రొఫెసర్, నృత్య శాఖ,

తెలుగు యూనివర్సిటీ