మన బతుకు సంస్కృతి బతుకమ్మ

ప్రపంచంలోని ఎన్నో దేశాలు పూలను కొలుస్తూ పండుగలు చేసుకుంటున్నా.. తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంది. బతుకమ్మ గురించిన పురాణగాథలు, కథలు ఏమున్నా ఇదొక పంటల పండుగగానే కనిపిస్తుంది. ‘దక్కన్’ పీఠభూమిలో భాగమైన తెలంగాణ.. గుట్టలు, వాగులు, వంకలకు నిలయం. అందుకే అనాదిగా ఇక్కడ మెట్ట పంటలు ఎక్కువగా పండుతాయి. నవ ధాన్యాలుగా పిలవబడుతున్న పంటలన్నీ ఇంటికి చేరిన సమయాన్నే సంప్రదాయకంగా బతుకమ్మ పండుగ వస్తుంది. పంటలకు పండుగ చేయడమనే ఆచారం నేటికీ ఆదివాసీ సంప్రదాయాల్లో ఉంది.

పంటల పండుగలు(హార్వెస్టింగ్​ ఫెస్టివల్స్) అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయి. తెలుగు ప్రజలు జరుపుకునే సంక్రాంతి కూడా పంటల పండుగే. అందుకే బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది రకాల పిండిని(సత్తుపిండితో పాటు) స్త్రీలు ఆటముగించుకున్న తర్వాత ఇచ్చిపుచ్చుకోవడం(ఆయినాలు–వాయినాలు) జరుగుతుంది. పంటను, అడవి పూలతో కొలిచే బతుకమ్మలో సౌందర్యాత్మకత కనపడుతుంది. అందుకే ప్రకృతికి, పంటలకు, వంటలకు, పునరుత్పత్తికి చేరువగా ఉన్న మహిళలే బతుకమ్మ పండుగకు ప్రధాన వనరుగా ఉన్నారు. వారి జీవనగాథలే బతుకమ్మ పాటలుగా, సామూహిక ఆటలుగా ప్రసిద్ధిగాంచాయి. ఉత్పత్తి కులాలు, బహుజనులే ఈ పండుగను చేసుకుంటున్నారు. దళితులను ఈ ఉత్సవంలో దూరంగా ఉంచే ఆచారాలను మారుస్తూ, నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపట్టడమే నిజమైన బతుకమ్మ అంటూ గడిచిన దశాబ్దకాలంగా బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంగానే గాకుండా ఉద్యమంగా కొనసాగిస్తున్నాం. పండుగలను సైతం హైజాక్​ చేయకుండా కాపాడుకోవాలని కృషి చేస్తున్నాం.

సాంస్కృతిక పునాదులపైనే ఉద్యమం

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రెండో దశ అంతా మన సాంస్కృతిక పునాదులపై సాగడం వల్లే అది స్థిరంగా సాగింది.  తెలంగాణ వనరుల దోపిడీ కోసం మన సంస్కృతిని సైతం విచ్ఛిన్నం చేసే కుట్రలు సాగాయి. అందుకే బతుకమ్మ ఉద్యమంలో ఒక సాంస్కృతిక సాధనంగా అందివచ్చింది. మన సంస్కృతిని కాపాడుకోవడమంటే తెలంగాణ ఉత్పత్తి విధానాన్ని కాపాడుకోవడమే. ఏ ప్రాంతమైనా తనకు ఆదరువునిస్తున్న సహజ వనరులను కాపాడుకుంటూ వాడుకుంటోంది. కానీ కొండలు, కోనలు, వాగులు, వంకల్లో ఇసుకను, పంటనిస్తున్న భూమిని సరుకుగా భావిస్తూ లాభాల కోసం వాటిని విధ్వంసం చేసి కొల్లగొట్టే ప్రక్రియను అడ్డుకుంటూ, మన గొలుసు చెరువులను, మన ఆహార పంటలను కాపాడుకుంటూ నవ తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని మేం ఆశించాం. కానీ, అదే పాత విధ్వంస నమూనా యథాతథంగా కొనసాగుతున్న నేపథ్యంలో బతుకమ్మ పండుగకు సరైన సందర్భం ఏర్పడింది. ఈ విధ్వంస నమూనాలో మనం కోల్పోయిన చెరువుల మూలంగా ఇప్పుడు నగరమే చెరువుగా మారిపోయింది. విలువైన గుట్టలు, సహజ సిద్ధమైన వాగులు అంతరించిపోతున్నాయి. దీని వల్ల గొలుసు చెరువులకు నీళ్లందే ఆదరువు, ఆధారం కనుమరుగైపోతోంది. వందలాది చెరువులను నింపుతూ 1872లో మూసీ నదిపై నిర్మాణమైన ఫిరంగి నాలా గురించి ప్రజలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తోంది. వికేంద్రీకృత అభివృద్ధికి నిలయమైన చెరువులు, కుంటలను కాదని, వేల కోట్లు కుమ్మరించి ఎత్తిపోతల పథకాల కోసం వెంపర్లాడాల్సి వస్తోంది.

విడివిడిగా ఆడుకుందాం.. కలిసి పోరాడుదాం

ఇంతకాలం కరోనా ఉంటే ఇప్పుడు వరదలు వచ్చాయి. ‘ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’ అన్న మాటలు మరోసారి రుజువయ్యాయి. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై మాస్కులు కట్టుకొని ముందుకు వెళదామా, వెనక్కి వెళదామా అంటూ డైలామాలోనే ప్రభుత్వం ఉందని అర్థమైంది. ఈ పరిస్థితిల్లో ‘‘విడివిడిగా ఆడుకుందాం, కలిసికట్టుగా పోరాడుదాం’’ అని బహుజన బతుకమ్మ పిలుపునిచ్చింది. ‘‘స్త్రీలు, ప్రకృతి బతుకమ్మ’’ అంటూ గత ఏడాది నల్లమల్ల సంరక్షణ ఉద్యమాన్ని సాగించాం. ఈ ఏడాది ‘‘ప్రకృతిని, తద్వారా మనల్ని మనం కాపాడుకుందాం’’ అనే సందేశంతో ముందుకు సాగుదాం. ప్రకృతికి, పర్యావరణానికి  చెడు చేసే పరిశ్రమలను, ఫార్మాసిటీని నిలిపేసి సహజ వనరులకు ప్రజలను సంరక్షకులుగా చేసే చర్యలే తెలంగాణను, బతుకమ్మను దీవించగలవు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ ఆత్మగా చూడాలి. అంతే తప్ప ఆదాయ వనరుగా, లాభాపేక్ష సరుకుగా చూడనప్పుడే బతుకమ్మ తెలంగాణ బతుకుగా వర్థిల్లుతుంది. తెలంగాణ జీవితం నుంచి వచ్చిన సంస్కృతిని, తెలంగాణ సంస్కృతి నుంచి పెరిగే జీవితాన్ని ముడివేసుకొని ఆలోచించడమే తెలంగాణ నవ నిర్మాణానికి బాటలు వేయగలదు.

వికేంద్రీకరణతోనే అభివృద్ధి

వికేంద్రీకృత అభివృద్ధే నిజమైన ప్రజాస్వామ్యం. నవ ధాన్యాలతో కూడిన ఆహార పంటలే ప్రజలకు నిజమైన స్వావలంబననిచ్చి దేశీయ అభివృద్ధికి బాటలు వేస్తాయి. అలాంటి స్వయం పోషక విలువలను, సంస్కృతిని ఏ మేరకు ఎత్తిపట్టినా ఈనాడు కరోనా లాంటి అంటు వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. అందుకే బతుకమ్మ కేవలం మన పండుగ మాత్రమే కాదు. తెలంగాణ బతుకు సంస్కృతి. ఆ సాంస్కృతిక విలువలను మన జీవన సారంగా చేసుకోవడానికి తొమ్మిది రోజుల ఆటపాటల్లో మనల్ని మనం నెమరేసుకునే సందర్భం కావాలి. ఇంకా మన చుట్టూ దడికట్టుకున్న అంటరానితనపు ఆచారాలను పెకలించే సందర్భమై కలిసి రావాలి. ఆ లక్ష్యంతో గడిచిన పుష్కర కాలంగా రాష్ట్ర ఉద్యమంలో పార్లమెంటు బిల్లు కోసం బాటలో బతుకమ్మ ప్రారంభించి, తెలంగాణ నవ నిర్మాణంలో బహుజన బతుకమ్మగా ఆటపాటలతో సాగుతున్నాం. తెలంగాణ.. బహుజన కులాలది, సమూహాలదే అని అంగీకరిస్తున్న పాలకులు, తెలంగాణ సహజ వనరులకు ప్రజలను సంరక్షకులుగా చేయనంత కాలం ప్రజా తెలంగాణ అవతరించదు. సహజ వనరులకు యజమానులై పిడికెడు మంది దోపిడీదారులు అత్యాశలకు మనం కరువులుగా, వరదలుగా చివరికి కరోనాగా చవి చూస్తూనే ఉన్నాం.

– విమలక్క, బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ

For More News..

రాజకీయాలు తెలియని లీడర్​ నాయిని

బీహార్‌లో నితీశ్‌ను మోడీ కాపాడగలరా?

దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారం!

ఉల్లిగడ్డ మస్తు తింటున్నం.. ఒకప్పుడు ఏటా 2 కేజీలు తింటే.. ఇప్పుడు 14 కేజీలు