రాజ కుటుంబం మారిపోయింది

ఈ ఫొటో చాలా పత్రికల్లో , మేగజైన్లలో వచ్చింది. అలా ఓసారి చూసి పక్కన పడేసే ఫొటో కాదు ఇది. ఈ ఫొటోకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రిటిష్ రాజకుటుంబంలో ఇటీవల వచ్చి న అనేక మార్పులకు ఈ ఫోటో అద్దం పడుతోంది. బ్రిటిష్ రాజ కుటుంబం గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. కిందటేడాది రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ,హాలీవుడ్ నటి మెఘన్ మెర్కెల్ పెళ్లితో అవన్నీ అపోహలని తేలిపోయింది. మెఘన్ మార్కెల్ రాజకుటుంబానికి చెందిన అమ్మాయి కాదు. సాదా సీదా కుటుంబంలో పుట్టిన అమ్మాయి. మిడిల్ క్లాస్ అమ్మాయే కాదు, నల్లజాతి మూలాలు కూడా ఉన్న అమ్మాయి. మెఘన్ తల్లి డోరియా రాగ్లాం డ్ ఆఫ్రికన్ అమెరికన్. తండ్రి మెక్సి కన్. నల్లజాతి తల్లికి పుట్టినా కూడా రాజకుటుంబం ఆమెను ఆదరించింది. స్వీకరించింది. ఒకప్పుడు యూరప్ లో ని రాజ వంశాలతోమాత్రమే వియ్యమందిన బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ఇలా మారిపోవడం మామూలు విషయంకాదు. ప్రిన్స్ హ్యారీ, మెఘన్ కు పుట్టిన ఆర్చీ హ్యారిసన్ మౌంట్ బాటన్ విండ్సర్ కు కూడా నల్లజాతి మూలాలు ఉన్నట్లే కదా. అయినా కూడా క్వీన్ ఎలిజెబెత్ 2 భర్తతో కలిసి వచ్చి మునిమనవడిని చూసింది. నిండు మనసుతో ఆశీర్వదించింది. ఈ కార్యక్రమానికి మెఘన్ తల్లిడోరియా కూడా హాజరైంది. అందుకే ఈ ఫొటోకు ఇంత ప్రత్యేకత వచ్చింది.

‘బేకార్’ కామెంటే

రాజకుటుంబాన్ని అందరూ అభినందిస్తుంటే చిన్నారి ఆర్చీ హ్యారిసన్ ను బీబీసీ హోస్ట్  డానీ బేకర్ అవహేళన చేశాడు. ఇద్దరు దంపతులు ఒక చింపాంజీని ఆస్పత్రి నుంచి తీసుకెళుతున్న ఫొటోను పెట్టి ‘రాయల్ బేబీ లీవ్స్ హాస్పిటల్ ’ (ఆస్పత్రి నుంచి వెళుతున్న బుల్లి రాకుమారుడు) అంటూ చిన్నారి ఆర్చీపై అసభ్యంగా రాతలు రాసి ట్వీట్ చేశాడు. దీంతో డానీ  బేకర్ పై నెటిజన్లు మండిపడ్డారు. సోషల్ మీడియాలో గొడవ అయింది.  నెటిజన్ల ఆవేశాన్ని అర్థం చేసుకున్న బేకర్ వెంటనే వివాదానికి దారితీసిన ఫొటోను తొలగించాడు. అయితే బీబీసీ ఊరుకోలేదు. బేకర్ ఉద్యోగం ఊడగొట్టి ఇంటికి పంపింది.