ఐపీఎల్‌తో పోలికా.. మీకు! పిచ్ సహకరించట్లేదని మ్యాచ్ రద్దు

ఐపీఎల్‌తో పోలికా.. మీకు! పిచ్ సహకరించట్లేదని మ్యాచ్ రద్దు

వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ రద్దవ్వడం చూసుంటారు.. అంతకూ కాదంటే వెలుతురు లేమి సమస్యతో ఆట నిలిపివేయటం చూసుంటారు. కానీ మనం చెప్పుకోబోతున్న ఈ ఘటన పైరెండింటికి విభిన్నం. పిచ్ అనుకూలించట్లేదని మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ సంఘటన ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది.

ఆదివారం(డిసెంబర్ 10) గీలాంగ్ వేదికగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్థాంతరంగా రద్దయ్యింది. పిచ్ అనుకూలించకపోవడమే అందుకు కారణం. బంతి అసమానరీతిలో బౌన్స్‌ అయ్యింది. బ్యాటర్ ఒకలా ఊహిస్తే బంతి మరో దిశలో వెళ్ళింది. దీంతో సురక్షితం కాదని, ఇలానే కొనసాగిస్తే ఆటగాళ్లు గాయాల బారిన పడే అవకాశం ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. కేవలం 6.5 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది.

ఐపీఎల్‌తో పోలికా..!

ఐపీఎల్‌తో పోలిస్తే తమదే గొప్ప లీగ్(బిగ్ బాష్) అని క్రికెట్ ఆస్ట్రేలియా పదే పదే గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటిది పిచ్ సహకరించట్లేదని మ్యాచ్ రద్దు చేయడంతో నెట్టింట నవ్వులు పాలవుతోంది. మ్యాచ్ వీక్షించడానికి స్టేడియంకు వచ్చిన అభిమానులకు, బ్రాడ్‌కాస్టర్లకు ఏం సమాధానం చెప్తారని ఆస్ట్రేలియా బోర్డును నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆసీస్ బోర్డును ట్యాగ్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు.