
Bengaluru: బెంగళూరులో ప్రజలు ఎక్కువగా దొరుకుతున్న ఉపాధి అవకాశాలతో ప్రయోజనంతో పాటు అదే స్థాయిలో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నగరంలోని ప్రజలపై పాల రేట్ల నుంచి పెరిగిన పన్నులు, స్కూలు ఫీజుల వరకు అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వస్తున్న ఆదాయం దాదాపుగా ఖర్చులకు సరిపోతున్నాయని చాలా మంది అక్కడ నివసిస్తున్న తెలుగు ఫ్యామిలీలు వాపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించే ఒక వార్త ఉంది.
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) సంస్థ నగరంలోని రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు తాజాగా పార్కింగ్ పన్నును తగ్గించాలని నిర్ణయించింది. దీనికి ముందు చదరపు అడుగుకు రూ.2 యూనిట్ ఏరియా విలువ చొప్పున పార్కింగ్ రుసుమును నిర్ణయించాలని చేసిన ప్రతిపాదనపై రెసిడెన్షియల్ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రెసిడెన్షియల్ యూనిట్లపై పన్నుల పెంపు ద్వారా కమర్షియల్ ప్రాపర్టీల నుంచి ఆదాయ నష్టాలను భర్తీ చేసేందుకు బృహత్ బెంగళూరు సంస్థ ఈ ఆలోచనతో వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రజల నుంచి దీనిపై భారీగా ప్రతికూలత రావటంతో చివరికి దీనిపై వెనక్కి తగ్గాలని వారు నిర్ణయించుకున్నారు.
ప్రజల అభిప్రాయలాను పరిగణలోకి తీసుకుని పార్కింగ్ పన్నులను తగ్గిస్తామంటూ సోమవారం దీనిపై ఒక ప్రకటనను బీబీఎంపీ విడుదల చేయటంపై నగరంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తగ్గింపులకు సంబంధించిన ప్రకటనను డిప్యూటీ సీఎం డికె శివకుమార్ వెలువరించవచ్చని తెలుస్తోంది. అయితే తగ్గించిన పార్కింగ్ పన్నులు రెసిడెన్షియల్ యూనిట్లకు కమర్షియల్ కంటే చాలా తక్కువగా ఉండనుందని తెలుస్తోంది.
వాస్తవానికి 2008 నుంచి పార్కింగ్ పన్నును ఆస్తి పన్నులో భాగమని అధికారులు పట్టుబట్టారు. పార్కింగ్ స్థలాన్ని అందించిన వారి నుంచి ఇప్పటివరకు మొత్తం ఆస్తి పన్నులో 50 శాతం మాత్రమే వసూలు చేయబడుతోంది. అయితే దీనిని తాము మరింతగా తగ్గిస్తామి, త్వరలోనే డిప్యూటీ సీఎం ప్రకటన చేస్తారని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం రెసిడెన్షియల్ ప్రాపర్టీలపై పార్కింగ్ పన్నును మెుత్తానికి తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించని లేదా అందించని ప్రాపర్టీలపై పన్ను విధించటం సమంజసం అని ప్రజలు చెబుతున్నారు.
రాబోతున్న మార్పులు ఇదే..
గతంలో సగటున కమర్షియల్ పార్కింగ్ ఏరియాలకు చదరపు అడుగుకు రూ.7గా ఉన్న రేటు రూ.3కి తగ్గించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా కమర్షియల్ పార్కింగ్ టాక్స్ చదరపు అడుగుకు రూ.12.50 వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమసంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు సగటున రేటును రూ.2.10 నుంచి రూ.2కి తగ్గించవచ్చని వెల్లడైంది.