చిగురుమామిడి, వెలుగు: ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన జడ్పీ మీటింగ్‌లో చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీసీ, దళిత నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం చిగురుమామిడి మండలకేంద్రంలోని బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం లీడర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యేకు పార్లమెంటరీ, ప్రజాస్వామ్యం విధానాలపై గౌరవం లేదన్నారు. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన వ్యక్తి కౌశిక్‌రెడ్డి అన్నారు. బీసీ, దళిత లీడర్లు బెజ్జంకి అంజయ్య, వంశీకృష్ణ, జక్కుల బాబు, సంజీవ్ కుమార్, శ్రీనివాస్, దొబ్బల బాబు, వెంకటేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మెట్‌పల్లి, వెలుగు: ముదిరాజ్ కులస్తులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆ సంఘం స్టేట్ సెక్రటరీ తోకల రాజేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మెట్‌పల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జడ్పీ మీటింగ్‌లో జడ్పీటీసీ రవీందర్‌ను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. గతంలోనూ ఎమ్మెల్యేగా ఉన్న ఈటలను కూడా అవమానకరంగా మాట్లాడాడని మండిపడ్డారు.