బీసీ, హిందూ కార్డులతో కాంగ్రెస్​ దశ మారేనా?

బీసీ, హిందూ కార్డులతో కాంగ్రెస్​ దశ మారేనా?

ఒకప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో రాజకీయ నాయకులు ముస్లింల పవిత్రమైన ఈద్‌‌‌‌‌‌‌‌ను ఎంతో ఘనంగా జరుపుకునేవారు. సూర్యాస్తమయం తర్వాత ముస్లింలు ఉపవాసాలు విరమించే సమయంలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తమ ఇండ్లల్లో ఇఫ్తార్‌‌‌‌‌‌‌‌ విందును ఏర్పాటు చేసేవారు. సెక్యులర్ నాయకులు అని పిలవబడే నాయకులందరూ విలాసవంతమైన విందులు నిర్వహించేవారు.  ప్రస్తుతం ఆ రోజులు కనుమరుగయ్యాయి. బదులుగా ఇప్పుడు రాజకీయ నాయకులు, సెక్యులర్ పార్టీలు అని పిలవబడే నాయకులు కూడా హిందూ దేవాలయాలలో పూజలు చేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. హిందువుల పండుగలను ఘనంగా నిర్వహించడంతోపాటు మీడియాలో కనపడేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. హిందూ దేవుళ్లకు నాయకులు పూజలు చేస్తూ మీడియాను ఆహ్వానిస్తున్న సందర్భాలకు కొదవే లేదు.  ప్రతి కొత్త సంవత్సరం ఆరంభంలోనే  ప్రారంభమయ్యే పండుగ మకర సంక్రాంతి నుంచి హోలీ, శ్రీకృష్ణ జన్మాష్టమి, దేవీనవరాత్రులు, దసరా, దీపావళి... ఇలా ఒక పండుగ తరువాత మరో పండుగను ఏడాది పొడవునా జరుపుకోవడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. విచిత్రమేమిటంటే, ఇంతకు ముందు బీజేపీ నాయకత్వం మాత్రమే ఇలాంటి పండుగలను నిర్వహించడంలో బిజీగా ఉండేది. 

ఆనవాయితీ మార్చుకున్న కాంగ్రెస్​

కాంగ్రెస్  పార్టీ, ఇతర సెక్యులర్ పార్టీలు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీల నాయకులు ఎటువంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా ఉండేవారు.  ఇది ఫౌస్టియన్ బార్టర్​ సిస్టమ్​ లాంటిది.. ఒక వ్యక్తి తన వ్యక్తిగత విలువలు లేదా అత్యున్నతమైన నైతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రాపంచిక, భౌతిక ప్రయోజనాల కోసం చేసుకునే వ్యాపార ఒప్పందం వంటిది అనవచ్చు. హిందువుల ఓట్లను సంపాదించే గొప్ప అవకాశం కోసం కాంగ్రెస్​ తన ఆనవాయితీని పక్కనపెట్టింది. ప్రత్యర్థులను ఓడించలేకపోతే, వారి సెంటిమెంటునే వాడాలని కాంగ్రెస్ ప్రస్తుతం సూత్రప్రాయంగా పాటిస్తోంది. అకస్మాత్తుగా, హిందూత్వ ఎజెండాపై కానీ, బీజేపీ నాయకత్వంపై కానీ విమర్శల హోరు కాంగ్రెస్​ నాయకుల నుంచి వినిపించడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ నాయకులు కూడా తమను తాము హిందూ ఫాలోవర్లుగా మార్చుకున్నారు. 

ప్రియాంక, రాహుల్​గాంధీ పోటాపోటీ పూజలు

 కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్​అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నర్మదా నది తీరాన పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. హిందూ దేవుళ్లు, దేవతల పట్ల కాంగ్రెస్​ నాయకుల కొత్త ప్రేమను ఇది బహిర్గతం చేస్తోంది. రాహుల్​గాంధీ బ్రాహ్మణ వర్గాల ఆశీస్సుల కోసం 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చేసిన ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. హిందూ ఓటర్లను ఆకర్షించే క్రమంలో రాహుల్​ గాంధీ హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్​ దేవాలయాన్ని కూడా సందర్శించారు.  బ్రాహ్మణ సంప్రదాయాలను పాటించిన హిందూయేతర నాయకుడిగా తనపై ఉన్న ఇమేజ్​ను మార్చుకునే ప్రయత్నం చేశారు.  కాంగ్రెస్​ పార్టీ ఎట్టకేలకు మైనార్టీల ఓట్లపైనే ఆధారపడి ముందుకువెళ్లడం అన్నివేళలా విజయవంతం కాదనే వాస్తవాన్ని  తెలుసుకుంది. బీజేపీకి పెద్ద మొత్తంలో భారీస్థాయిలో గంపగుత్తగా ఓటువేసే హిందువులుగా కాకుండా, ముస్లింల ఓట్లు చీలిపోవడంతో మైనారిటీలను అన్నివేళలా బుజ్జగించడం విజయవంతం కాదన్న విషయాన్ని కాంగ్రెస్​ హైకమాండ్​ ఎట్టకేలకు గ్రహించింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముస్లిం మైనారిటీలు కూడా కాంగ్రెస్​పార్టీపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి అవలంబించే పెద్ద వ్యూహంలో ఇది కూడా ఒక భాగమని వారు గ్రహించారు.   

తనను హిందువుగా చెప్పుకున్న రాహుల్​

రాహుల్​గాంధీ 4వేల కిలోమీటర్ల భారత్ జోడో యాత్రలో దాదాపు అన్ని దేవాలయాలను సందర్శించి ప్రజల్లో ఐక్యతా సందేశాన్ని చాటారు. తాను జంధ్యంధరించిన హిందువుని అని రాహుల్ గాంధీ​ఇప్పటికే ప్రకటించారు. అయితే రాహుల్​ ఢిల్లీలోని నిజాముద్దీన్​ దర్గా, కాశ్మీర్​లోని హజ్రత్ బల్​ తదితర ముస్లిం పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించారు. కానీ, తనను తాను హిందువుగా ప్రొజెక్టు చేసుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు.  1984లో కేవలం రెండు సీట్ల నుంచి 1998లో భారీగా 182సీట్లకు ఎగబాకిన బీజేపీ గేమ్​ప్లాన్​ను అనుసరించడం ద్వారా, ముస్లింలను బుజ్జగించడం బదులుగా హిందువులను ఆకట్టుకునేలా కాంగ్రెస్​ పార్టీ వ్యూహాత్మకంగా తన విధానాన్ని మార్చుకుంది. అదీకాక ఒకే దెబ్బకు రెండు పిట్టల మాదిరిగా కుల రాజకీయాలను ప్రోత్సహించేలా కులగణన పేరిట మరో అడుగు ముందుకేసింది. 

బీజేపీ మార్గంలోనే కాంగ్రెస్​

కాంగ్రెస్​ పార్టీ ఓబీసీ కార్డు వ్యూహం.. బీజేపీ హిందూత్వ ఎజెండా, లౌకిక పార్టీల మండల్​ కార్డుల కంటే మించింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నారీశక్తి వందన్ అధినియమ్​ పేరుతో ఆమోదించిన మహిళాబిల్లులో ఓబీసీలను బీజేపీ చేర్చకపోవడాన్ని కాంగ్రెస్​ ఆయుధంగా మలుచుకుంది. ఈ అంశాన్ని నాలుగు రాష్ర్టాల్లో కాంగ్రెస్​ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాగా, కాంగ్రెస్​ వ్యూహం మార్చడాన్ని భారతదేశ రాజకీయాల్లో ఓ కీలక మలుపుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకు ముందు దేశంలో రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు సెక్యులర్, కమ్యూనల్​ ఎజెండాపై ఎన్నికల్లో పోటీ చేశాయి. కానీ, ఇప్పుడు తన పంథాను మార్చుకోవడం ద్వారా కాంగ్రెస్ కూడా బీజేపీ మార్గంలోనే పయనిస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య వ్యత్యాసం పెద్దగా కనిపించడంలేదు. కానీ, ఓటర్లు ఓటుబ్యాంక్​ రాజకీయాలను అవగాహన చేసుకుంటున్నారు. హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్​ ఎన్నడూ ప్రయత్నించలేదు. మరోవైపు బీజేపీకి ముస్లింలపై చెప్పుకోదగ్గ ప్రేమలేదు. రెండు పార్టీలు హిందువులను మభ్య పెడుతున్నాయంటే ఎవరూ కాదనగలరు?

కాంగ్రెస్​ వ్యూహాలు ఫలితమిచ్చేనా?

అయోధ్య రామమందిర సమస్య, ట్రిపుల్ తలాక్,​రాజ్యాంగంలోని ఆర్టికల్​ 370 రద్దు ఇప్పటికే అమలయ్యాయి. ఇక హిందువులను ఆకట్టుకోవడానికి బీజేపీకి కొత్త ఎజెండా లేకపోగా కాంగ్రెస్​ ఓబీసీ కార్డును  మళ్లీ ముందుకు తెచ్చింది. మిజోరాంను మినహాయిస్తే నాలుగు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు చాలా ప్రభావం చూపనున్నాయి. కాంగ్రెస్​ఎత్తుగడ ఫలిస్తే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జరగనున్న లోక్​సభ ఎన్నికల్లో కూడా అదే ట్రెండ్​ను హస్తం పార్టీ పునరావృతం చేయడం ఖాయం. 
మరోవైపు జీ20 సమిట్ భారత్​ అధ్యక్షతన విజయవంతమవడంతో బీజేపీ జాతీయవాద కార్డును ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, సార్వత్రిక ఎన్నికల ముంగిట హిందూత్వానికి కాంగ్రెస్​ చేరువ మార్గాన్ని ఎంచుకోవడం, బీజేపీ అడుగుజాడల్లో నడవడం వల్ల కమలం పార్టీకి జరిగే నష్టం తెలియాలంటే, ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేవరకూ 
వేచి చూడాల్సిందే. 

హస్తంపార్టీ చేతిలో హిందూకార్డు

మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ హిందూ కార్డును ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్​పార్టీ ఏమాత్రం సిగ్గుపడటం లేదు. గోశాలలు నిర్మాణమైనా, హిందూ మంత్రాలు పఠిస్తున్నా, ఆర్భాటంగా దసరా నవరాత్రి ఉత్సవాలు, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు వెనుకంజ వేయడం లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్​ నాయకులు అన్నిరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. పావులు కదుపుతున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్​ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్​నాథ్​ తనను తాను హనుమంతుడి నిజమైన భక్తుడిగా ప్రకటించుకున్నారు. ఒక అడుగు ముందుకేసి ఇతర రాష్ట్రాల కాంగ్రెస్​ నాయకులకు హిందూ కార్డును ఉపయోగించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. సుందరకాండ, భగవద్గీత, హనుమాన్​ చాలీసా పఠనం వంటి అనేక హిందూ మతపరమైన కార్యక్రమాలనుకమల్​నాథ్​ నిర్వహిస్తున్నారు.

ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లోనూ..

కమల్​నాథ్​ బాటలోనే చత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, రాజస్తాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ పయనిస్తున్నారు. హిందూ దేవుళ్లను ప్రసన్న చేసుకునేందుకు దేవాలయాలను సందర్శిస్తూ, భారీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి రాష్ట్రాల్లో మెజారిటీ కమ్యూనిటీకి చెందినవారి మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హిందూ మతానికి చెందిన ఈ ముఖ్యమంత్రులందరూ తమ ఇండ్లల్లో నాలుగు గోడల మధ్యే మతపరమైన పూజాకార్యక్రమాలు నిర్వహించుకునేవారు. కానీ, ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్​పార్టీ నాయకులు బీజేపీ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులు ఇదే పంథాను అనుసరించి ఎక్కువ ఓట్లు పొందు తున్నప్పుడు తాము కూడా వారి మార్గంలోనే వెళ్లి ఎందుకు విజయం సాధించకూడదనే భావన కాంగ్రెస్ నేతల్లో కనపడుతోంది. కాంగ్రెస్​ కంటే ముందే ఆమ్​ఆద్మీ పార్టీ (ఆప్​) రాజకీయ చతురతను ప్రదర్శించి బీజేపీకి షాక్​ ఇచ్చింది. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశ్ ల దేవతా చిత్రాలను ముద్రించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ ఇచ్చిన మాస్టర్​ స్ట్రోక్ బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది.

 

- అనితా సలూజా, రాజకీయ వ్యాఖ్యాత