సార్వత్రిక ఎన్నికల్లో.. బీసీలే నిర్ణేతలు

తెలంగాణలో రాజకీయాలు అమాంతం మారిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లతోపాటు ,  బీఎస్పీ  తెలంగాణలో మళ్లీ జవసత్వాలు కూడదీసుకునేందుకు యత్నిస్తుంది. సైద్ధాంతిక సారూప్యత కలిగిన వివిధ సంఘాల బలగం బీజేపీకి బలం జాతీయవాదం, హిందుత్వవాదంతో  తెలంగాణ ప్రజల్లోకి  చొచ్చుకెళ్లాలి అనే బలమైన సంకల్పం వారి అధిష్టానానికి ఉన్నప్పటికీ నాయకుల లేమి పార్టీని వెంటాడుతుంది. దానికి తోడు క్షేత్రస్థాయిలో సరైన సంఖ్యలో కార్యకర్తలు లేకపోవడం ప్రతికూల అంశం. ఇందుకు ప్రధాన కారణం 2018 ముందు వరకు బీజేపీ ఒంటరిగా పోటీ చేయకపోవడమే.

కాంగ్రెస్ కు  బలమైన సంప్రదాయ ఓటు బ్యాంకు, కార్యకర్తలు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో పాటు, కొత్తగా అవతరించిన వైఎస్ఆర్​టీపీ, ధర్మసమాజ్ పార్టీలతో పాటు బీఎస్పీ కూడా తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుకు గండి కొడుతుందనడంలో సందేహం లేదు. ఇటీవల వైఎస్ఆర్​టీపీ కాంగ్రెస్ లో  విలీనం అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ కలయిక ఇరువురికి శ్రేయస్కరమే అని చెప్పవచ్చు. ఆర్ఎస్పీ రాకతో బీఎస్పీ జోరందుకున్నది  వాస్తవం. అత్యంత ధన ప్రభావంతో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ 4వేల పైచిలుకు ఓట్లు సాధించడం సాధారణ విషయం కాదు. ఇక పాత బస్తీలో ఎంత కుస్తీపడ్డా కూడా ఎంఐఎం స్థానాలు చెక్కుచెదరడం కష్టమే.  

గెలుపుల వెనుక బీసీలు

దాదాపు ప్రతి పార్టీకి ఏదో ఒక బలమైన సామాజిక వర్గం సంపూర్ణ మద్దతు తెలుపుతూ కావాల్సినన్ని విరాళాలు ఇస్తూ... ప్రతిగా తమ ప్రభుత్వ ఏర్పాటు జరిగినప్పుడు ప్రతిఫలాలు పొందుతారు. కానీ బలహీన సామాజిక వర్గం మద్దతుతో విశారదన్ మహారాజ్ స్థాపించిన ధర్మసమాజ్ పార్టీ ఒక సామాజిక విప్లవానికి ఊపిరి ఊదింది. బలహీన, బలమైన సామాజిక వర్గాల ఓటర్లు అధిక శాతం తమ నిర్ణయం ముందే తీసుకుంటారు. కానీ దాదాపు 50% జనాభా కలిగిన వెనుకబడిన తరగతులకు చెందిన బీసీల ఓట్లే ఏ పార్టీకి పగ్గాలు అప్పజెప్పాలో నిర్ణయిస్తాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. తెలంగాణలో 144 కులాలను బీసీలుగా గుర్తించారు. బీసీల కేంద్రంగా ఏ పార్టీ నిలదొక్కుకోలేకపోవడం ఒక కారణమైతే, బీసీ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు తలొక పార్టీకి వత్తాసు పలకడం మరో కారణం. వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్ల రాజ్యాధికారంలో వాటా  సంపాదించలేక పోయినప్పటికీ,  నిర్ణయ అధికారం మాత్రం ఇప్పటికీ వీరి చేతుల్లోనే ఉంది. ఎన్టీఆర్ హయాంలో బీసీలు టీడీపీకి వెన్నెముకగా నిలిచారు. ఆ హయాంలో బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో సింహభాగం బీసీలకు దక్కేది. 

బీఆర్​ఎస్​ పాలనలో  ప్రాభవం కోల్పోయిన బీసీలు

తెలంగాణ ఉద్యమంలో భాగంగా బీసీలు టీడీపీ నుంచి టీఆర్ఎస్ వైపు తిరిగారు. కానీ గత తొమ్మిదేళ్లలో బీసీలు పొందిన ప్రతిఫలం లేకపోగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 33% నుండి 23% తగ్గించారు. అంటే బీసీలకు రాజకీయ అవకాశాలు తగ్గినట్టే అని చెప్పాలి. బీసీలకు సంక్షేమ పథకాలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో ఈ వర్గంలో బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పై వ్యతిరేకత ఏర్పడింది. అది గమించిన ఆ పార్టీ ప్రధాన నాయకుడు ఎన్నికల ముందు బీసీ బంధు పథకం తెరపైకి తెచ్చాడు. అదేవిధంగా మొన్నటి వరకు బీజేపీ కూడా బీసీలను ఆకర్షించే విధమైన హామీలు ఇవ్వడంతో పాటు, సంస్థాగతంగా పార్టీ పదవులలో బీసీలకు పెద్దపీట  వేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ డిక్లరేషన్, బీసీల జనగణ చేస్తామంటూ 50 శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తామని ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు.  ఏ పార్టీ బీసీ ప్రజల మన్ననలు పొందుతుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రాజకీయ చైతన్యం లేని సామాజిక వర్గాలు ఆర్థిక పురోగతి సాధించడం కష్ట సాధ్యమైన పనే.

 బుర్ర రవితేజ గౌడ్, అడ్వకేట్