కేంద్ర బడ్జెట్​లో బీసీలకు తీవ్ర అన్యాయం : ఆర్.కృష్ణయ్య

కేంద్ర బడ్జెట్​లో బీసీలకు తీవ్ర అన్యాయం : ఆర్.కృష్ణయ్య
  •     బడ్జెట్​ను సవరించి బీసీలకు రూ. 2లక్షల కోట్లు కేటాయించాలి
  •     రాజ్యసభ సభ్యుడు   ఆర్.కృష్ణయ్య డిమాండ్

బషీర్ బాగ్, వెలుగు : కేంద్రంలోని బీజేపీకి బీసీలంటే ఎందుకు ఇంత వివక్ష అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. యూనియన్​బడ్జెట్​లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది బీసీలు ఉంటే, కేవలం రూ.2,300 కోట్లు కేటాయించడమేమిటన్నారు. మోదీ బీసీ కావడంతో దేశంలోని బీసీలంతా బీజేపీకే ఓట్లు వేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.

జాతీయ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వలు భరత్ కుమార్ అధ్యక్షత శుక్రవారం కాచిగూడలో 30 బీసీ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బీజేపీ తులసీ వనమని.. ప్రస్తుతం అందులో గంజాయి మొక్కలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని వీడాలని, బడ్జెట్ ను సవరించి బీసీలకు రూ.2లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.