
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన గణనలో కుల గణన చేపట్టేలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వా నికి బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ కోరారు. బుధవారం సంజయ్ నేతృత్వంలో బీసీ నేతలు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, కుల గుణన ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ప్రధానిని ఒప్పించాలని కోరారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సంజయ్ వెల్లడించారు. దేశవ్యాప్త కులగణనకు ప్రభుత్వం యోచిస్తున్నదని, ఈ విషయంపై ప్రధానితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు.