తెలంగాణ ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం బీసీ లబ్దిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక సాయం దరఖాస్తు కోసం కావాల్సిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసిల్దార్ కార్యాలయాల ముందు పడిగాపులు కాస్తున్నారు. తాజాగా కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం లబ్దిదారులు రోజుల తరబడి వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
పెండింగ్ లో 5వేల దరఖాస్తులు...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ లబ్దిదారులు కుల , ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈ సర్టిఫికెట్లు జారీ చేయడంలో ఎమ్మార్వో అధికారులు ఆలస్యం చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల నుంచి సర్టిఫికెట్ల కోసం తాహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఒక్క కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలోనే 5వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉంటే..జిల్లాల్లో మిగిలిన మండలాల్లోని కార్యాలయాల్లో ఇంకెన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉండచ్చని ప్రశ్నిస్తున్నారు. అయితే దరఖాస్తులు చేసే సమయంలో సర్వర్లు సక్రమంగా పని చేయకపోవడంతో.. సర్టిఫికెట్ ల జారీ ప్రక్రియ ఆలస్యమవుతుందని తహసీల్దార్ కార్యాలయ అధికారులు అంటున్నారు. అందుకే రోజు రోజుకు దరఖాస్తు పత్రాలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు.
అటు జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నిన్న(జూన్ 14) నుంచి ఇన్ కం సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర జనాలు పడిగాపులు కాస్తున్నారు. రాత్రి కూడా కార్యాలయం దగ్గరే సర్టిఫికెట్ల కోసం మహిళలు క్యూలైన్లలో ఉన్నారు. అన్ని పనులు వదిలేసుకొని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా.. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే బీసీలకు ఇచ్చే ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సర్టిఫికెట్లు జారీ చేయడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారు... కాబ్టటి దరఖాస్తు గడువు తేదీని పెంచాలని బాధితులు కోరుతున్నారు.