బీసీ బిల్లు దేశానికే మార్గదర్శకం: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ బిల్లు దేశానికే మార్గదర్శకం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: బీసీ బిల్లు దేశానికే మార్గదర్శకం. స్థానిక సంస్థల్లో, విద్యా, ఉపాధి అవకాశాల్లో బలహీనవర్గాలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని గొప్ప విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ  చెప్పిన విధంగా ‘ఎవరెంతో వారికంత’ అనే విధంగా ముందుకు పోతున్నాం. 

కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాం. కేంద్రానికి పంపే బిల్లుకి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. 50శాతం  రిజర్వేషన్లపై క్యాప్ ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిలపక్షంతో ప్రధానిని కలుస్తాం.  బిల్లు ఆమోదానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు. 

‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వేషన్లకు కృషి: విప్​ ఆది శ్రీనివాస్

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా, విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రతిపక్షాలు బీసీ బిల్లుకు సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అందరి సహకారం ఉంటే బీసీలకు న్యాయం జరుగుతుంది. 

బీసీల్లోని పలు కులాలు నేటికీ చట్టసభల్లోకి రావట్లే:ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్

బీసీల్లోని పలు కులాలు నేటికి కూడా చట్ట సభల్లో రాలేని పరిస్థితి ఉంది. చేతులు ఎత్తి మొక్కుతున్నా.. ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లుకు సహకరించాలి. సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి బీసీలకు న్యాయం జరిగేలా చూడాలి. 

చట్ట సవరణకుకేంద్రం సహకరించాలి:ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య

ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేశాం. రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు కోసం ప్రవేశపెడుతున్న బిల్లు ఇది. కేంద్రం కూడా చట్ట సవరణకు సహకరించాలి. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఎక్కడా చేయని విధంగా తెలంగాణలో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తున్నది. 

పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చొద్దు: ఎమ్మెల్యే సూర్యనారాయణ

పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టే బిల్లుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని  ఖండిస్తున్నాం. ఈ నిర్ణయం తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుంది. పొట్టి శ్రీరాములు జాతీయ నాయకుడు. కేవలం తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు. దేవాలయాల్లో నిమ్నజాతుల కోసం పోరాడి ప్రవేశం కల్పించిన ఘనత పొట్టి శ్రీరాములుది. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి.  సురవరం పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలి. అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది.