బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలి.. ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో నేతలు

బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలి.. ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో నేతలు

తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఢిల్లీలో ‘మహా ధర్నా’కు దిగాయి. ‘బీసీల పోరు గర్జన’ పేరుతో వివిధ బీసీ సంఘాలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆదిమూలపు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత విహనుమంతరావు, నటుడు సుమన్ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే హాజరై మద్ధతు తెలిపారు. ఈ మహా ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు, వివిధ రాష్ట్రాల ఎంపీలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ పార్టీది ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.  బీసీలకు 42 రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. 

డీఎంకే ఎంపీ కణిమొళి బీసీ పోరుగర్జన సభకు హాజరయ్యారు. డీఎంకే పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్ధతు ఇస్తున్నామని, ఈ విషయంలో తెలంగాణ, తమిళనాడు కలిసి కొట్లాడుతామని అన్నారు. తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సంతోషం.. కేంద్ర పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని అన్నారు. అందుకోసం దేశవ్యాప్త కులగణన జరపి బీసీలకు వాటా ఇవ్వాలని  డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుదామని కనిమొళి పిలుపునిచ్చారు.

ఇక ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మహా ధర్నాకు హాజరయ్యారు. కుల గణన చేయకుండా కేంద్రం బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. అందరికంటే తెలంగాణ రాష్ట్రం ముందుగా కులగణన చేయడం అభినందనీయని అన్నారు. బీసీ బిల్లుకు ఎన్సీపీ మద్ధతు ఇస్తుందని చెప్పారు. పార్లమెంటులో మద్ధతు ఇస్తామని చెప్పారు. కులగణన దేశ వ్యాప్తంగా జరగాల్సి ఉందని, పీడితుల పక్షాన నిలబడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాడుతామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 

వివిధ రాష్ట్రాల ఎంపీలు హాజరై బీసీ పోరు గర్జనకు మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కుల గణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన బీసీ బిల్లును ఆమోదించి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర విప్ ఆదిమూలపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కులగణన చేసి వాటా తేల్చాలని హామీ రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారు. అందుకోసం గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని అన్నారు. హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినట్లు తెలిపారు. తెలంగాణలో పక్కా కులగణన లెక్కలు జరిపి.. బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగ సవరణ చేసి బీసీ బిల్లును ఆమోదింపచేయాల్సిన బాధ్య బీజేపీకి ఉందని అన్నారు.  వెంటనే ఈ సమావేశాల్లోనే షెడ్యూల్ 9 లో చేర్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు.