నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓసీ వర్సెస్ బీసీ క్యాండిడేట్ అన్నట్టుగా తయారైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికల్లో ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. 22,554 మంది ఎన్ రోల్ చేసుకున్నారు. వచ్చే నెల 9 వరకు గడువు ఉండడంతో మరో 8 వేల మంది ఓటర్లు కొత్తగా ఎన్ రోల్ అయ్యే చాన్స్ ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 56 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. వీటిలో యూటీఎఫ్, టీఆర్టీయూ, తపస్ ముఖ్యమైనవి.
ఆయా సంఘాల్లో 30 వేల మంది టీచర్లు సభ్యులుగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో జాక్టో నుంచి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. తపస్ బలమైన బీసీ అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తుంది. పీఆర్టీయూ, యూటీఎఫ్ లు రెడ్డి సామాజిక వర్గ క్యాండిడేట్ కు ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో అభ్యర్థి ఎవరనే సమీకరణాలు మారుతున్నాయి.
బీసీ క్యాండిడేట్స్పై ఇంట్రెస్ట్
2019 ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ పై యూటీఎఫ్ నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ఈసారి టీచర్ ఎమ్మెల్సీని ఎలాగైనా దక్కించుకోవాలనే వ్యూహంతో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు ముందుకెళ్తున్నాయి. యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, పీఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డి ఎంపికయ్యారు. తపస్ నుంచి ఇంకా ఎవరిని ప్రకటించలేదు. కాగా బీసీ అభ్యర్థి వైపు ఇంట్రెస్ట్ చూపుతుంది. బహుజనవాదం బలోపేతానికి టీచర్లు బీసీ అభ్యర్థికి ఇవ్వాలని చర్చలు చేస్తున్నారు. ఇప్పటికే టీచర్ల సంఘాల జేఏసీ(జాక్టో) నుంచి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఖరారు అయ్యారు.
ఆయన తొలుత పీఆర్టీయూ నుంచి ప్రయత్నించినా.. చివరిలో శ్రీపాల్ రెడ్డిని ఎంపిక చేశారు. దీంతో సుమారు 30 ఉపాధ్యాయ సంఘాల జేఏసీ (జాక్టో) పూల రవీందర్ కు మద్దతు ప్రకటించాయి. మరోవైపు అలుగుబెల్లి నర్సిరెడ్డిపై ఉపాధ్యాయ సంఘాలు కొంత వ్యతిరేకతతో ఉన్నాయి. మొత్తం 30 వేల మంది ఓటర్లలో 4,500 మంది ఓసీలు, 5 వేల మంది ఎస్సీ, ఎస్టీలు, 20 వేల మంది బీసీ ఉన్నారు. ఈసారి ఎలాగైనా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటూ బీసీ సామాజికవర్గానికి చెందిన ఉపాధ్యాయ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక సమీకరణలు రోజు రోజుకు మారుతున్నాయి. అయితే.. పోటీలోకి దిగనున్న అభ్యర్థులంతా బీసీ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంటున్నారు.