హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన కార్యక్రమం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి రోజుల పాటు అధికారులు ఇండ్లకు స్టిక్కర్లు వేసి, ఇండ్ల జాబితా నమోదును చేస్తారు. గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల పేర్లు ప్రత్యేక కోడ్ రూపంలో సేకరిస్తున్నారు. నమోదు చేసిన ఇంటి జాబితాలో వార్డు, ఇంటి నంబర్, వీధి పేరును సేకరించి డాటాను ఎంటర్చేస్తున్నారు.
ఇంటి జాబితా నమోదైన తర్వాత ఇంటింటికి వెళ్లి స్టిక్కర్ వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సర్వే కోసం ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చింది. ఈ సర్వేలో ప్రజల సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ వివరాలతో 75 ప్రశ్నల ఫార్మాట్‌ను రెడీ చేశారు. ఈ ప్రత్యేక ఫార్మాట్ప్రకారం వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి రోజు పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 21వరకు ఇంటింటి సర్వేను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 ఇండ్లను కేటాయించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 87,900 మంది ఎన్యుమరేటర్లను ప్రభుత్వం నియమించింది. ఇందులో దాదాపు 40 వేల మంది టీచర్లు ఉండగా , 10 మంది ఎన్యుమరేటర్లకు ఒకరి చొప్పున 8,500 మంది పర్యవేక్షకులను నియమించారు.
సర్వేతో రాష్ట్రం రోల్మెడల్: మంత్రి శ్రీధర్‌బాబు
ఇంటింటి సర్వేతో రాష్ట్రం రోల్‌మోడల్‌గా మారబోతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో సమగ్ర కుటుంబ సర్వేను శ్రీధర్‌బాబు ప్రారంభి మాట్లాడారు.. సర్వేతో రేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఎలాంటి కార్డులు పోవని స్పష్టం చేశారు. సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.