ఇండియా వైపు బీసీల మొగ్గు

ఇండియా వైపు బీసీల మొగ్గు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో బీసీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) లకుజరిగిన అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడానికి..దేశంలోని వివిధ సామాజిక న్యాయ సంస్థలు, మేధావులు ఏకమయ్యారు. బీసీలు దేశంలో అత్యధిక మెజారిటీ జనాభా  అయినప్పటికీ, జనాభాలో స్వల్పంగా ఉన్న అగ్రవర్ణ సంఘాలు వారిని అధికారంలోకి రానివ్వలేదనేది  అందరికీ తెలిసిన విషయమే. అగ్రవర్ణాలు చాకచక్యంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని మెజారిటీ ప్రజల ప్రయోజనాలను అణచివేశాయి. దేశంలోని అన్ని రంగాల్లో బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వకుండా,  వారికి హక్కులు లేకుండా చేసి బీసీలను శాశ్వతంగా వెనుకబాటుకు గురిచేశాయి. బీసీలు తమకు జరిగిన అన్యాయాన్ని గ్రహించారు. ప్రజాస్వామ్య దేశంలో తమకు న్యాయపరంగా రావాల్సిన వాటా కోసం గళమెత్తారు. 

ఇప్పుడు, బీసీలు తమకు జరిగిన అన్యాయాన్ని గ్రహించి, ప్రజాస్వామ్య దేశ పాలనలో తమకు రావాల్సిన వాటా కోసం గళం విప్పారు. వెనుకబాటుతనాన్ని, దోపిడీని పారదోలేందుకు నిశ్చయించుకున్నారు. అధికారంలోకి రావడం ద్వారానే తమకు  సాధికారత, సామాజిక న్యాయం అందుతుందని బీసీలు దృఢంగా నమ్ముతున్నారు. రాష్ట్రాల్లోని అన్ని విభాగాల్లో  విద్య, వైద్యం, ఉపాధి, పాలనలో బీసీల ఉన్నతికి గత ప్రభుత్వాలు కచ్చితమైన విధానాలను పాటించలేదు. ఈ నేపథ్యంలో బీసీలు తమ న్యాయమైన డిమాండ్​లను సాధించుకునేందుకు రాజకీయ అధికారమే అత్యంత ప్రధానమని గ్రహించారు. బీసీ సంఘాలు ఇండియా కూటమి అభ్యర్థులకు, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు అండగా ఉండాలని, బీజేపీ దాని మిత్రపక్ష పార్టీల అభ్యర్థులకు ఓటు వేయకూడదని సీరియస్​గా ఆలోచిస్తున్నాయి.  బీసీలు రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో తమ జనాభా  నిష్పత్తిలో తమకు రావాల్సిన వాటాను అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్​ మేనిఫెస్టో ఆమోదనీయం 

2024 పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, అన్ని వర్గాల కుల గణనను  నిర్వహిస్తామని, ప్రతి వర్గానికి అన్ని విభాగాల్లో వారి వారి వాటాను అందజేస్తామని రాహుల్​ గాంధీ  బహిరంగ సభల్లో ప్రకటించారు. విద్య, ఉద్యోగాల్లో సమానత్వం, ఆర్థిక అవకాశాలను సాధించేందుకు నిశ్చయాత్మక వ్యూహాలు, విధానాలను సిఫారసు చేయడానికి సమాన అవకాశాల కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని,  కమిషన్​  సిఫార్సులను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన విప్లవాత్మక మేనిఫెస్టోలో పేర్కొన్నది.  అధికారంలోకి వచ్చిన  ఒక సంవత్సరం వ్యవధిలోనే  ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వు చేయబడిన బ్యాక్‌‌‌‌లాగ్ ఖాళీలను భర్తీకి  200 పాయింట్ల రిస్టోర్​ సిస్టమ్​ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్​  వాగ్దానం చేసింది.  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు, పదోన్నతులు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 

కాంగ్రెస్​ విద్యా హామీ

బీసీలందరికీ సమానమైన, క్వాలిటీ ఎడ్యుకేషన్​, వైద్యం అందిస్తామని, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ బీసీలందరికీ కూడా వర్తింపజేస్తామని కాంగ్రెస్​ పేర్కొంది. బీసీల ప్రయోజనాల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్​  మీడియంను ప్రారంభిస్తామని, ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు చట్టాన్ని చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. షెడ్యూల్డ్ ప్రాంతాల జల్ జంగిల్ జమీన్​  హక్కులు షెడ్యూల్డ్ తెగలకు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్​ తెలిపింది. 

రాహుల్​ గాంధీ సానుకూల స్పందన
 
2024 పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి దేశంలోని మెజార్టీ సోషల్​ ఆర్గనైజేషన్స్ ఏకమయ్యాయి. దీనిలో  భాగంగా  ఈ నెల 13న రాహుల్​గాంధీని ప్రముఖ సామాజిక సంస్థల ప్రతినిధులము కలిశాము. వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు  కూటమిలోని  ఇతర నాయకులు బహిరంగ ప్రసంగాల్లో  కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టోలో  ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని ప్రకటించేలా ప్రోత్సహించాలని చెప్పాం.   కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాల కోసం సామాజికంగా,  విద్యాపరంగా వెనుకబడిన తరగతుల ఉన్నతికి రాజ్యాంగంలోని  ఆర్టికల్ 342A(3) ప్రకారం ఒక చట్టాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని​ ఏఐబీసీఎఫ్​ రాహుల్​ గాంధీని అభ్యర్థించింది.  బీసీల ఉన్నతికి  తీసుకునే  చర్యలు 2024 పార్లమెంటు ఎన్నికల్లో  ఇండియా కూటమికి గొప్ప మైలేజ్​ను అందిస్తాయని చెప్పాం. 

ఇండియా కూటమిలోని పార్టీలకు మా డిమాండ్లు

    2024 పార్లమెంటరీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా కాకుండా, బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలి. లేదా ఈవీఎం,వీవీప్యాట్లపై జస్టిస్​ మదన్​ లోకూర్​ కమిషన్​ నివేదికను అమలు చేయాలి. వీవీప్యాట్​ స్లిప్​ ఓటరు చేతి ద్వారనే మరో ఓటు బాక్స్​లో వేయించాలి.  శాంతియుత ధర్నాలు, సామూహిక ఆందోళనల ద్వారా అందిన ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి  
తీసుకోవాలి.  
    ఆదాయపు పన్ను చట్టం ప్రకారం  పన్ను విధించదగిన ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఉన్నవారందరికీ ఉచిత, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అందించాలి.

     సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల సర్వేను నిర్వహించాలి.  సర్వే నివేదిక ఆధారంగా కేంద్ర జాబితాలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను పేర్కొనాలి.  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A (1)&(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం,  దాని సంస్థలలోని అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం సామాజిక, వెనుకబడిన స్థాయి ఆధారంగా  బీసీలను సబ్​ కేటగిరీలుగా వర్గీకరించాలి.

    ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో  సామాజికంగా,  విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితాను, ఆర్టికల్ 342A(3) కింద సెంట్రల్ లిస్ట్‌‌‌‌కి భిన్నంగా ఒక చట్టం చేసి, దాని ద్వారా అమలు చేయాలి.
    క్రీమిలేయర్​ ప్రమాణాన్ని తొలగించి,  అన్ని వెనుకబడిన తరగతుల ఉప వర్గాలకు శాస్ర్తీయంగా వారికి అందాల్సిన వాటాను అందించాలి. 
 
    ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు, ఎలాంటి సామాజిక  వివక్ష లేకుండా దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్​) ఉన్న అన్ని కులాలు,  వర్గాలకు ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్‌‌‌‌ను అందించాలి. 
 
    ఉపాధి, విద్య, పరిపాలన, జ్యుడిషియరీ, పార్లమెంట్, అసెంబ్లీలు, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, ప్రైవేట్ రంగంలో బీసీ  జనాభాకు అనుగుణంగా  రిజర్వేషన్లు కల్పించడం కోసం భారత రాజ్యాంగాన్ని సవరించాలి.  

    ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే  వెనుకబడిన తరగతుల జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయించాలి.   కేంద్ర ప్రభుత్వంలో బీసీ  సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.  

    ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలి. ప్రైవేట్​ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. పాత పెన్షన్​ విధానాన్ని పునరుద్ధరించాలి.  

    శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గంలో వారి జనాభా నిష్పత్తిలో అన్ని వర్గాలకు చోటు కల్పించేందుకు రాజకీయ పార్టీలను పునర్నిర్మాణం జరపాలి. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని  అడ్డుకుని అన్ని వర్గాలకు వారి జనాభాకు  రావాల్సిన వాటా అన్ని రంగాల్లో  దక్కాలని ఆలిండియా వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ (ఎఐబీసీఎఫ్​) ​ డిమాండ్​ చేస్తోంది. 

- జస్టిస్​ వి.ఈశ్వరయ్య,     
ఆలిండియా బీసీ ఫెడరేషన్ 
అధ్యక్షుడు,

పూర్వ జాతీయ 

బీసీ కమిషన్​ చైర్మన్,
భారత ప్రభుత్వం