ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీయబోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆరుసార్లు తీసిన జనాభా గణనలో కులాల వారీగా లెక్కలు తీయలేదు. కానీ, ఈసారి కులాల వారీగా లెక్కలు తీయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అన్ని పార్టీలు, బీసీ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఫ్రంట్, ఇతర సంఘాలు సుప్రీంకోర్టులో కేసు వేయగా.. కోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.
మన రాజ్యాంగంలో కులాల పేరు మీద ఎస్సీ/ఎస్టీ/బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ సామాజిక వర్గాల లెక్కలను మొదటి నుంచి తీస్తున్నారు. అలాగే మహిళా-పురుష జనాభా గణన కూడా ఉంది. కానీ, బీసీ కులాల జనాభా వివరాలు మాత్రం సేకరించడం లేదు. ఈ ఏడాది చేపట్టనున్న జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం 32 కాలమ్స్‌తో నమూనా పత్రం విడుదల చేసింది. ఇందులో ఎస్సీ/ఎస్టీల వివరాల కాలం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల వివరాలు, ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ ఉన్నాయి. కానీ, బీసీ కులాల వివరాలకు సంబంధించిన కాలం పెట్టలేదు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా, హైకోర్టులు-/సుప్రీంకోర్టు ఆదేశిస్తున్నా బీసీ కులాల జనాభా లెక్కింపునకు ఎందుకు ముందుకు రావడం లేదు?.
బీసీ కులాల వారీగా లెక్కలు అవసరమే
బీసీ కులాల వారీగా జనాభా లెక్కల వివరాలు సేకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధికి అనేక స్కీములు అమలు చేస్తున్నాయి. బడ్జెట్‌నూ కేటాయిస్తున్నాయి. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నాయి. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కేటాయింపు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీ జనాభా లెక్కల వివరాలు అవసరం పడుతున్నాయి. ఈ లెక్కలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీసీ జనాభా లెక్కలు లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి పథకాలు, ఇండ్ల పథకాలు, స్వయం ఉపాధి పథకాలకు బడ్జెట్ కేటాయింపుల సమయంలో ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి చైర్మన్‌గా కమిటీ వేసింది. కులాల వారి జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకరణ చేసి ఏయే గ్రూపుకు ఎంత శాతం నిర్ణయించాలో తెలియక మూడేండ్లుగా తికమక పడుతోంది. ఎట్టకేలకు నాలుగు గ్రూపులుగా విభజించి 2–6——-9–10 శాతం చొప్పున ప్రకటించినా.. అది శాస్త్రీయంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి.
2010లో ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం
1931లో అంటే బ్రిటిష్ వారి పాలన టైంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ తర్వాత నుంచి బీసీ జనాభా లెక్కలు తీయడంపై కేంద్ర ప్రభుత్వం ఊగిసలాడుతోంది. అనేక పోరాటాల తర్వాత 2010లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీకరించింది. అయితే అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ మొదలైంది. దీంతో రూ.6 వేల కోట్లు కేటాయించి కులాల వారిగా జనాభా లెక్కలు ప్రత్యేకంగా తీశారు. బీసీ కులాల గణన పేరిట సాగిన ఈ లెక్కల సేకరణ బాధ్యతను కేంద్రం మొక్కుబడిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పింది. కొన్ని రాష్ట్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ కూలీలు, అంగన్‌వాడీ టీచర్లు, ఎన్‌జీవోల ప్రతినిధులు ఇలా ఎలాంటి జవాబుదారీ లేని వ్యక్తుల ద్వారా సమాచార సేకరణ జరిపాయి. దీంతో ఈ లెక్కల్లో లక్షల తప్పులు దొర్లాయి. ఈ లెక్కల ద్వారా సమగ్ర పట్టిక తయారు చేయడానికి ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్‌తో ఒక కమిటీ వేశారు. ఆ వివరాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. 2010లో బీసీ కులాల వారిగా లెక్కలు తీయాలని పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కులాల వారిగా లెక్కలు తీయవలసిన బాధ్యత, అవసరం ఉంది.
ఘర్షణలు జరుగుతాయన్న వాదనలో పసలేదు
జనాభా లెక్కలు తీస్తే ఇప్పటి వరకూ అణచివేతకు గురైన కులాల వారు తాము ఎక్కువ సంఖ్యలో ఉన్నామని తెలిస్తే తిరగబడి అన్ని రంగాల్లో తమ వాటా తమకు కావాలని అడుగుతారేమోననే భయమా. ఇన్నేండ్లు తమ కాళ్ల దగ్గర పడి ఉన్న పేద కులాల వారికి అధికారంలో వాటా ఇస్తే వీరు కలెక్టర్, ఆఫీసర్, ఎమ్మెల్యే, మంత్రులై పక్కన కూర్చుంటారని భావిస్తున్నారా. జనాభా లెక్కలు తేలితే విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు పెంచాలని, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ ముందుకు వస్తుందని ఆందోళనా? కులపరమైన సమాచారాన్ని సేకరించినట్లయితే దేశంలో ఆయా కులాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని చెబుతూ ఇన్నేండ్లూ కుల జనగణన చేయలేదా! మతపరమైన వివరాలు, భాషాపరమైన వివరాలు ఈ గణాంకాల్లో సేకరిస్తున్నారు. ఇవి సేకరించినప్పుడు జరగని ఘర్షణలు కులపరమైన సమాచారం సేకరిస్తే జరుగుతాయని చెప్పడంలో పసలేదు.
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బీసీ జనాభా లెక్కలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జనగణనలో కులాల వారీ లెక్కలు తీయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం 2006లో కేంద్రానికి లేఖ రాసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా కులాల వారిగా జనాభా లెక్కలు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దాదాపు అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినా స్పందన లేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు, ఇతర రిజర్వేషన్లు, ఇతర అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలు బీసీ జనాభా లెక్కలు తీశాయి. 1984లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా జనాభా లెక్కలు తీసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహించగా బీసీ జనాభా 52 శాతం ఉన్నట్టు తేలింది. అలాగే ఏపీ, కర్నాటక, తమిళనాడులో కూడా సర్వేలు చేశారు. కానీ, వీటికి చట్టబద్ధత లేదని కోర్టులు అంగీకరించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిసారి బీసీ జనాభా లెక్కలు తీస్తున్నారు. ఇందుకోసం ప్రతి రాష్ట్రం వందల కోట్లు కేటాయించి లెక్కలు సేకరిస్తోంది.
మన దేశంలో అన్ని వర్గాల వివరాలనూ జనాభా లెక్కల ద్వారా సేకరిస్తున్నారు. పులులు- ఇతర జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ, బీసీ కులాల వారిగా లెక్కలు లేకపోవడం అన్యాయం. ఈ లెక్కలు సేకరిస్తే నష్టం ఏమిటనే ప్రశ్నకు జవాబు లేదు. కులాల వారి లెక్కలు తీయడం వల్ల కులతత్వం పెరుగుతుందని పసలేని విమర్శలు చేస్తున్నారు. ఇదంతా ఊహాజనితమే. ఎందుకంటే మతాల వారీగా లెక్కలు తీస్తున్నారు. మతతత్వం పెరుగుతోందా? ఎస్సీ, ఎస్టీ కులాల వారిగా లెక్కలు తీయడం లేదా? ఏమైనా కులతత్వం పెరిగిందా? కాబట్టి కేంద్రం స్పందించి జనగణనలో బీసీ కులాల వారి లెక్కలు తీసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలి. జనగణన కాలమ్స్‌లో ఒక కాలం పెరుగుతుంది. ఒక్క పైసా అదనంగా ఖర్చు కాదు. పైగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలనా సౌలభ్యం కోసం కులాల వారి లెక్కలు ఉపయోగపడతాయి.
లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ఎలా?
– రాజ్యాంగంలోని 15(4)(5), 16(4)(5) ప్రకారం బీసీ కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా ఉంది. జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెడతారు. రాజ్యాంగంలోని 243D-(6), 243T-6 ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఉంది. జనాభా లెక్కలు లేకుండా కోటా ఎలా నిర్ణయిస్తారు. రాజ్యాంగం ప్రకారం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి సిఫార్సులు చేయాలంటే జనాభా లెక్కలు కావాలి. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రొవిజన్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే బీసీ కులాల లెక్కలు కావాలి.
కోర్టు తీర్పుల ప్రకారం లెక్కలు తీయాలి
రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో హైకోర్టు-సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారని లేదా పెంచుతారని ప్రభుత్వాలను ప్రశ్నించాయి. మండల్ కమిషన్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని అడిగింది. 1986లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మురళీధర్‌రావు కమిషన్ సిఫార్సు ప్రకారం ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన పెంచారని ప్రశ్నిస్తూ.. పెంచిన రిజర్వేషన్లను కొట్టేసింది.
2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్నాటక ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు, జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన అమలు చేస్తారని, ఆ రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు కొట్టేసింది. జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఉంటే ఆ మేరకు పెంచవచ్చని తీర్పు చెప్పింది.1996లో బీసీ జనాభా లెక్కలు తీసేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో కేసు వేయగా బీసీ జనాభా లెక్కలు తీయాలని ఆదేశించింది. ఇలా వందల కేసుల్లో సుప్రీంకోర్టు-హైకోర్టులు బీసీ జనాభా లెక్కలు తీయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదు.
బీసీ కమిషన్లకు మొదటి నుంచీ ఇబ్బందులే
బీసీ జనాభా లెక్కలు లేనందున రిజర్వేషన్ల శాతం ఎంత నిర్ణయించాలనే అంశంపై మొదటి నుంచి బీసీ కమిషన్లు ఇబ్బంది పడుతున్నాయి. ఎప్పుడో 1931లో తీసిన లెక్కలపై ఆధారపడి ఇప్పటికీ నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కలు జాతీయ స్థాయిలో ఒకే రకంగా లేవు. ఎందుకంటే కొన్ని సంస్థానాలు బ్రిటిష్ పాలనలో లేవు. అలాగే జనాభా అభివృద్ధి రేటు అన్ని కులాల్లో ఒకేలా లేదు. మత విశ్వాసాలు, సంప్రదాయాల కారణంగా కొన్ని వర్గాలు కుటుంబ నియంత్రణ పాటించకపోవడంతో వృద్ధి రేటులో తేడాలున్నాయి. కేంద్రం నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్ 1961లో జనాభా లెక్కల్లో కులాల వారి లెక్కలు తీయాలని సిఫార్సు చేసింది. 1978లో నియమించిన మండల్ కమిషన్ కూడా బీసీ జనాభా లెక్కలు తీయాలని సిఫార్సు చేసింది. వివిధ రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు కులాల వారీ లెక్కలు తీయాలని ప్రభుత్వాలకు సిఫార్సు చేశాయి. ఈ లిస్ట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన అనంతరామన్ కమిషన్(1968), వీరప్ప కమిటీ(1975), మురళీధర్‌రావు కమిషన్(1982) కూడా ఉన్నాయి. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం