- టికెట్ల ప్రకటనపై పునరాలోచన చేయాలని బీఆర్ఎస్ కు అల్టిమేటం
- ఉదయ్ పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి
- బీజేపీ టికెట్ల కోసం పెద్దసంఖ్యలో అప్లికేషన్లు ఇస్తున్న బీసీ లీడర్లు
కరీంనగర్, వెలుగు: ఎమ్మెల్యే టికెట్ల కోసం బీసీ కులాలు గొంతెత్తుతున్నాయి. జనాభాలో తామెంతో అంతే శాతం సీట్లు కేటాయించాలని వివిధ రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాయి. నెల రోజుల నుంచే వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో వివిధ చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు, ఆత్మ గౌరవ సభలు నిర్వహిస్తుండగా, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నాయి.
టికెట్ల విషయంలో పునరాలోచన చేయాలని వివిధ కుల సంఘాల నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ కు ఆల్టిమేటం జారీ చేయగా.. ప్రతి లోక్ సభ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇవ్వాలన్నా ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలతోపాటు, బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. బీజేపీ పార్టీలోనూ టికెట్ల కోసం బీసీ లీడర్ల నుంచి తీవ్ర పోటీ కనిపిస్తోంది.
బీఆర్ఎస్ పై భగ్గుమంటున్న బీసీ కులాలు..
ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో బీసీలకు కేవలం 22 సీట్లే కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులోనూ 10 మున్నూరు కాపులకు, 5 యాదవులకు, 4 గౌడ్స్ కు, బెస్త, వంజర, పద్మశాలీలకు ఒక్కో టికెట్ చొప్పున ప్రకటించారు. బీసీ కులాల్లో అధిక జనాభా ఉన్న కులాలైన యాదవ, మున్నూరు కాపులకు కొంత న్యాయం జరిగినా.. అదే సంఖ్యలో ఉండే ముదిరాజ్ లకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ కులస్థులు భగ్గుమన్నారు. ముదిరాజ్ లను రాజకీయంగా అణచివేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం తమకు 5 సీట్లయినా కేటాయించాలని, జాబితాను పున:పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
లేదంటే గజ్వేల్ లో సీఎం కేసీఆర్‌పై, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌పై పోటీ చేస్తామని ప్రకటించారు. ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ ఓట్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, కనీసం నాలుగైదు సీట్లయినా ఇస్తారని ఆశించిన పద్మశాలీలకు ఒక్క సీటుతో సరిపెట్టారు. కురుమలకూ అదే పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలోనే తమ సత్తా చాటేందుకు ఈ నెల 9న కురుమ గర్జన మీటింగ్ కు ప్లాన్ చేశారు. ఈ మీటింగ్ కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహ్వానించారు. తద్వారా కురుమ ఓటు బ్యాంకును కాంగ్రెస్ కు మళ్లించే ప్లాన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి బరిలో దిగడంతో పెరికలకు ఉన్న ఒక్క సీటును కూడా కోల్పోయారు.
ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు కోసం కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి..
ప్రతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించాలని రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో తీర్మానించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోయే జాబితా ఈ డిక్లరేషన్ ప్రకారమే ఉండాలని ఆ పార్టీలోని బీసీ నేతలు పట్టబడుతున్నారు. బీసీ సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే తమ సామాజిక వర్గాలను బీఆర్ఎస్ మోసం చేసిందని, కాంగ్రెస్ అయినా న్యాయం చేయాలని ఆయా కుల సంఘాల లీడర్లు కోరుతున్నారు.
అంతే గాక ఇదే డిమాండ్‌ను సమర్థిస్తూ ఆ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు గొంతెత్తడం విశేషం. కరీంనగర్లో నెల క్రితం జరిగిన ఓబీసీ కాంగ్రెస్ మీటింగ్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీసీల జనాభాకు అనుగుణంగా టికెట్లు ఇవ్వాలని కోరగా, ఇటీవల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నల్లగొండ కాంగ్రెస్ టికెట్‌ను బీసీలకే ఇవ్వాలని, తాను పోటీ చేయాలనుకుంటున్న నల్లగొండ సీటును వదులుకుంటానని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ బీసీ డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తే చాలా మంది బీసీ లీడర్లకు టికెట్లు దక్కే అవకాశముంది.
72 స్థానాల్లో బీసీలదే పై చేయి..
రాష్ట్రంలో 72 అసెంబ్లీ స్థానాల్లో 60 శాతం బీసీలున్నారు. ఈ స్థానాల్లో సగానికి పైగా అగ్రవర్ణాలకు చెందిన లీడర్లే రాజ్యమేలుతూ బీసీల అవకాశాలను హరిస్తున్నారు. అన్ని పార్టీలు 72 సీట్లను బీసీలకే కేటాయించాలి. కేవలం 22 స్థానాల నుంచే బీసీలు గెలిచి ప్రస్తుత అసెంబ్లీలో అడుగుపెట్టారు. 50 స్థానాలు అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, చేతి వృత్తి సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా బీసీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేశారు.
- దాసు సురేశ్, రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ రాజ్యాధికార సమితి
బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితా (సామాజికవర్గాలవారీగా)
ఓసీ: 58(రెడ్డి-40, వెలమ-11,
కమ్మ-5, వైశ్య-1, బ్రాహ్మణ-1)
బీసీ:22(మున్నూరు కాపు-10, యాదవ్-5,
గౌడ-4, బెస్త-1, వంజర-1, పద్మశాలీ-1)
ఎస్సీ: 20(మాల-8, మాదిగ-11, నేతకాని-1)
ఎస్టీ: 12 (లంబాడీ-7, ఆదివాసీ-5)
మైనార్టీ: 3