2021 సెన్సెస్‌లోనే బీసీ లెక్కలు తీయాలె

దేశంలో కులాల వారీగా బీసీ జనాభా లెక్కలు తీయకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాష్ట్రాలు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతీసారి.. కులాల వారీగా జనాభా లెక్కలు లేనప్పుడు ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్​ నిర్ణయిస్తారు..? ఎలా డిసైడ్​ చేస్తారంటూ.. కోర్టులు రిజర్వేషన్ల పెంపును ఒప్పుకోవడం లేదు. బీసీల లెక్కలు లేక స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు పెద్ద సమస్యగా మారుతోంది. బీసీ కమిషన్ల సిఫార్సుల ప్రకారం రాష్ట్ర స్థాయిలో కులాల వారీగా లెక్కింపు చేపడుతున్నప్పటికీ దానికి విశ్వసనీయత, శాస్త్రీయత ఉండట్లేదని కోర్టులు కొట్టేస్తున్నాయి. బడ్జెట్​కేటాయింపులు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులోనూ ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో జనాభా లెక్కల్లో భాగంగానే కులాల వారీగా బీసీల లెక్కలు తీయడం అనివార్యంగా మారింది. కరోనా కారణంగా వాయిదా పడిన 2021 జనాభా లెక్కింపు త్వరలో మొదలుకానుంది. ఇందులోనే బీసీ కులాల లెక్కింపు చేపడితే ఒక కాలమ్ ​అదనంగా పెరుగుతుంది తప్ప పైసా ఖర్చు ఉండదు.

దేశ వ్యాప్తంగా త్వరలో 2021 జనాభా లెక్కలు తీయబోతున్నారు. స్వాతంత్ర్యం తర్వాత 6 సార్లు జరిగిన జనాభా లెక్కింపులో కులాల వారి లెక్కలు తీయలేదు. అయితే ఈసారి జరిగే లెక్కింపులో కులాల వారీ లెక్కలు తీయాలనే డిమాండ్ బలంగా ముందుకు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, దాదాపు అన్ని పార్టీలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఫ్రంట్ తదితర సంఘాలు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో త్రిసభ్య కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ సమస్యపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఈ ఏడాది ఆగస్టు 23న బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో 10 రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్ష నేతలు ప్రధానమంత్రితో కలిసి జనాభా లెక్కింపులో కులాల వారి లెక్కలు తీయాలని కోరాయి. ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు అసెంబ్లీలు  కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇదే అంశాన్ని డిమాండ్​ చేశాయి. ఎస్సీ/ఎస్టీల జనాభా వివరాలు పూర్తిగా సేకరిస్తుండటంతో వారి జనాభా ప్రకారం ప్రభుత్వాలు ఆ కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. బీసీ కులాల వివరాలు లేకపోవడంతో ఓ అంచనా ప్రకారం మాత్రమే కేంద్రంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తోంది. బీసీల కులాల వారి జనాభా లెక్కలు లేనందువల్లనే సుప్రీంకోర్టు రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని 50 శాతానికి పరిమితం చేయాలని చెప్పింది. బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి నాలుగేండ్ల క్రితం జస్టిస్ రోహిణి చైర్మన్ గా కమిటీ వేశారు. కులాల వారి జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకరణ చేయలేకపోతోంది. 

2010లో అంగీకరించిన కేంద్రం

1931లో అంటే 90 ఏండ్ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం కులాల వారి జనాభా లెక్కలు సేకరించింది. 2010లో కులాల వారి లెక్కలు తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది.  అయితే అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ప్రత్యేకంగా బీసీ జనాభా లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు కేటాయించింది. కులాల వారి జనాభా లెక్కలు ప్రత్యేకంగా తీశారు. బీసీ కులాల లెక్కింపు పేరిట సాగిన ఈ లెక్కల సేకరణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మొక్కుబడిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పింది. ఆయా రాష్ట్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ కూలీలు, అంగన్ వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎలాంటి బాధ్యత, జవాబుదారీ లేని వ్యక్తుల ద్వారా సమాచార సేకరణ చేపట్టాయి. ఈ లెక్కింపులో వేల తప్పులు దొర్లాయి. ఈ లెక్కలను సమగ్ర పట్టిక తయారు చేయడానికి మాజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ తో ఒక కమిటీ వేశారు. కానీ ఆ తర్వాత వాటి వివరాలు, జనాభా సంఖ్య ఇంత వరకు ప్రకటించలేదు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. బీసీ జనాభా కులాల వారీగా లెక్కలు తీయాలని బీజేపీ పార్లమెంటులో డిమాండ్ చేసింది. ఆ పార్టీ కోరినందుకే అప్పటి కేంద్ర ప్రభుత్వం కులాల వారీ లెక్కలు తీయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కులాలు వారి లెక్కలు తీయాల్సిందే. 2018 ఆగస్టు 31న హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో జనాభా లెక్కింపులో బీసీ కులాల వారి లెక్కలు తీయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. 

రాజ్యాంగంలో ప్రొవిజన్స్

రాజ్యాంగంలోని ఆర్టికల్15(4) (5), 16 (4) (5) ప్రకారం బీసీ కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టంగా ఉంది. అయితే జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెడతారు. రాజ్యాంగంలోని 243 D-(6), 243 –T-6 ప్రకారం స్థానిక సంస్థల బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఉంది. జనాభా లెక్కలు లేకుండా ఇక్కడ కూడా రిజర్వేషన్ల శాతం అమలు చేయడం ఉత్తదే అవుతుంది. ఆర్టికల్​339 – బీ- ప్రకారం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి ఏ సిఫార్సు చేయాలన్నా జనాభా లెక్కలు కావాలి. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు, రక్షణలు, రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలు అవసరం. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రొవిజన్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే కచ్చితంగా బీసీ కులాల లెక్కలు కావాల్సిందే.

బీసీ కమిషన్ల సిఫార్సులు..

జనాభా లెక్కలు లేనందువల్ల రిజర్వేషన్లు ఎంత శాతం నిర్ణయించాలనే అంశంపై మొదటి నుంచి బీసీ కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. 1931లో బ్రిటీష్ ప్రభుత్వం సేకరించిన కులాల వారి లెక్కలపై ఆధారపడి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కలు జాతీయ స్థాయిలో ఒకే విధంగా లేవు. ఎందుకంటే కొన్ని సంస్థానాలు బ్రిటీష్ పాలనలో లేవు. అలాగే  జనాభా అభివృద్ధి రేటు అన్ని కులాల్లో ఒకే రకంగా లేదు. అందుకే జనాభా లెక్కింపులో కుల లెక్కింపు కూడా చేపట్టాలని1953 లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్1961జనాభా లెక్కింపులో కులాల వారి లెక్కలు తీయాలని సిఫార్సు చేసింది. రెండవ సారి 1978 లో కేంద్ర ప్రభుత్వం నియమించిన మండల్ కమిషన్ జనాభా లెక్కలు తీయాలని సిఫార్సు చేసింది. వివిధ రాష్ట్రాల్లో1968 నుంచి ఇప్పటి వరకు అనేక బీసీ కమిషన్లు కులాల వారి లెక్కలు తీయాలని ప్రభుత్వాలకు సిఫార్సు చేశాయి. 1994 తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నియమించిన అన్ని బీసీ కమిషన్లు కూడా కులాల వారి లెక్కలు తీయాలని సిఫార్సు చేస్తున్నాయి.  కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. వివిధ సందర్భాల్లో ఆయా కమిషన్లు జనాభా లెక్కలు సేకరించడానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అనేక రాష్ట్రాలు కులాల వారి జనాభా లెక్కలు తీశాయి. తెలంగాణ సమగ్ర సర్వే పేరుతో వివరాలు సేకరించింది. బీసీ జనాభా 52 శాతమని తేలింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు లెక్కలు తీశాయి. కానీ వీటికి చట్టబద్ధత లేదని కోర్టు అంగీకరించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిసారి బీసీ జనాభా లెక్కలు తీస్తున్నారు. ఇలా ప్రతి రాష్ట్రంలో వందల-, వేల కోట్లు బడ్జెట్ కేటాయించి జనాభా లెక్కలు విడివిడిగా తీస్తున్నారు. అలా కాకుండా 2021 సెన్సెస్​తోపాటే తీస్తే ఖర్చు తగ్గడంతోపాటు దానికి చట్ట బద్ధత, శాస్త్రీయత ఉంటాయి. 

కోర్టు తీర్పులు ఏం చెబుతున్నయ్​..

రిజర్వేషన్లు ప్రవేశపెట్టినపుడు లేదా పెంచిన సందర్భంలో హైకోర్టు, - సుప్రీం కోర్టులు జోక్యం చేసుకొని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారని ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. మండల్ కమిషన్ కేసు సందర్భంగా జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్ల శాతం ఎలా నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 1986లో మురళీధర్ రావు కమిషన్ సిఫార్సు ప్రకారం ఎన్టీఆర్ ​ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 25 నుంచి 44 శాతానికి పెంచింది. అయితే జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లను ఎట్ల పెంచుతారని అప్పటి ఏపీ హైకోర్టు సర్కారును ప్రశ్నిస్తూ.. పెంచిన రిజర్వేషన్లను కొట్టేసింది.  2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక  ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు, జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన అమలు చేస్తారని కోర్టు అడిగింది. బీసీల జనాభా లెక్కలు తీసేలా కేంద్ర,-రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని 1996లో బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టు స్పందించి బీసీల జనాభా లెక్కలు తీయాలని ప్రభుత్వానికి చెప్పింది. ఇలా వందల కేసుల్లో సుప్రీంకోర్టు,- హైకోర్టులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నా.. ఎలాంటి ఫలితం ఉండట్లేదు. 

కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి

కులాల వారీగా బీసీ జనాభా లెక్కలు లేకపోవడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో  ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జనాభా లెక్కింపులో కులాల వారీ లెక్కలు తీయాలని తమిళనాడు ప్రభుత్వం 2006లో కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా కులాల వారి జనాభా లెక్కలు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. 2019 డిసెంబర్ నెలలో మహారాష్ట్ర, బీహార్ తదితర దాదాపు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా స్పందన లేదు. కులపరమైన సమాచారాన్ని సేకరిస్తే దేశంలోఆయా కులాల మధ్య ఘర్షణ జరిగే ప్రమాదముందని కొందరు​ అంటున్నారు. ఇన్నేండ్లు కులాల వారీ లెక్కింపు చేయలేదా?  మతపరమైన వివరాలు, భాషా పరమైన వివరాలు కూడా ఈ గణాంకాల్లో తీస్తున్నారు. ఈ సమాచారం సేకరించినప్పుడు జరగని ఘర్షణలు కులపరమైన వివరాలు తీస్తేనే జరుగుతాయని చెప్పడమంటే రిజర్వేషన్ వ్యతిరేక వాదనలో పసలేదని స్పష్టమవుతోంది. వెంటనే ప్రభుత్వం స్పందించి జనాభా లెక్కింపులో బీసీ కులాల లెక్కలు తీయాలి.

- ఆర్,కృష్ణయ్య,
బీసీ సంక్షేమ సంఘం 
జాతీయ అధ్యక్షుడు