
- బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వడం అభినందనీయం
- 42 శాతం రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు అందాలని కామెంట్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వడం చరిత్రాత్మక ఘట్టమని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. దీంతో వెనుకబడిన కులాల ఆకాంక్షలు నెరవేరడానికి, రిజర్వేషన్ ఫలాలు అందేందుకు మార్గం సుగుమం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం ఖైరతాబాద్ లోని కమిషన్ కార్యాలయంలో మెంబర్లు సురేందర్, బాలలక్ష్మి, జయప్రకాశ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయి.. చట్టం అయ్యే వరకు అన్ని పార్టీలు ఐక్యంగా ఉండాలని నిరంజన్ కోరారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన సంచార జాతుల ప్రజల జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో వాళ్లు నివసించే ప్రాంతాల్లో పర్యటించామని ఆయన వెల్లడించారు.
వారికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో అవకాశం కల్పించాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించామని నిరంజన్ తెలిపారు. ఇదే సందర్భంగా బీసీల్లో తమ కులాల పేర్లు మార్చాలని కమిషన్ కు వినతులు అందజేశారని, ఈ పర్యటనల్లో ఆ కులాల ప్రజలతో సైతం చర్చించామన్నారు. ఈ రెండు అంశాలపై త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తామని చైర్మన్ నిరంజన్ వెల్లడించారు.
తమ్మలి, దొమ్మర, వంశరాజ్, బుడబుక్కల, మేర, కుమ్మర, రజక కులాల వారితో కమిషన్ ఆఫీసులో సమావేశం నిర్వహించి, కులాల పేర్ల మార్పిడిపై అభ్యంతరాలు తెలుపవలసిందిగా ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఆయా కులాల స్థితిగతులు తెలుసుకోవడానికి వేములవాడ, జగిత్యాల తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆయా కులాల ప్రజలతో చర్చించామన్నారు.