![ఏసీబీ వలలో బీసీ కమిషన్ చైర్మన్ పీఏ](https://static.v6velugu.com/uploads/2025/02/bc-commission-chairman-niranjan-pa-golla-srinivas-has-been-caught-in-acb-trap_KQnTFxoigs.jpg)
- బీసీ సర్టిఫికెట్ ప్రాసెస్ కోసం లంచం డిమాండ్ చేసిన శ్రీనివాస్
- రూ.లక్ష తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పీఏ గొల్ల శ్రీనివాస్ ఏసీబీ వలలో చిక్కాడు. బీసీ సర్టిఫికెట్ కోసం రూ.లక్ష లంచం తీసుకుంటూ శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచంగా తీసుకున్న డబ్బును ఏసీబీ అధికారులు కెమికల్ టెస్ట్ ఆధారంగా సీజ్ చేశారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి.. నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గొల్ల శ్రీనివాస్.. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వద్ద ఔట్ సోర్సింగ్ పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బీసీ సర్టిఫికెట్‌కు సంబంధించి ఓ బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేశాడు. ఫైల్ ప్రాసెసింగ్ చేయాలంటే రూ 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు.
ఇందులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.లక్ష ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించాడు. చైర్మన్ పీఏ లంచం డిమాండ్ చేయడంపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సిటీ రేంజ్–2 యూనిట్ ఏసీబీ అధికారులు ట్రాప్ స్కెచ్ వేశారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ ఆఫీస్ వద్ద నిఘా పెట్టారు. బాధితుడి నుంచి రూ.లక్ష తీసుకున్న వెంటనే శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. రూ.లక్ష, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.