రోడ్డుపై సర్వే అప్లికేషన్లు ఎలా పడ్డాయి? : నిరంజన్

రోడ్డుపై సర్వే అప్లికేషన్లు ఎలా పడ్డాయి? : నిరంజన్
  • సమగ్ర నివేదిక ఇవ్వండి
  • మేడ్చల్ కలెక్టర్​కు బీసీ కమిషన్  చైర్మన్ ఆదేశం
  • సూపర్ వైజర్​ను సస్పెండ్ చేశామన్న కలెక్టర్

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్–తార్నాక రోడ్లపై సమగ్ర సర్వే అప్లికేషన్లు ఉన్నట్లు సోషల్  మీడియాలో వచ్చిన వీడియోపై బీసీ కమిషన్  చైర్మన్  నిరంజన్ స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మేడ్చల్  కలెక్టర్  గౌతమ్, జవహర్ నగర్  మునిసిపల్  కమిషనర్ ను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులాల కుటుంబ సర్వే దరఖాస్తులు రోడ్లపై పడడం ఏంటని నిరంజన్  శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ అంశాన్ని డీజీపీ జితేందర్  దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై చైర్మన్  నిరంజన్ కు మేడ్చల్ కలెక్టర్  గౌతమ్ రిపోర్ట్  ఇచ్చారు. జవహర్ నగర్  మునిసిపల్  కార్పొరేషన్ కు చెందిన సూపర్ వైజర్ తన సొంత టు వీలర్  మీద ఆ ఫాంలు తీసుకెళ్తుంటే రోడ్డు మీద పడ్డాయని కలెక్టర్ తెలిపారు. వాటిని గమనించిన జలమండలి సిబ్బంది కార్పొరేషన్  అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. 

వీటిని వెంటనే సిబ్బందికి అందజేశారని కలెక్టర్  వివరించారు. దీనికి బాధ్యులైన  కాప్రా మండల్  తహసీల్దార్  ఆఫీసులో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న జ్యోతిని సస్పెండ్  చేశామని వెల్లడించారు. సమగ్ర సర్వే పకడ్బందీగా చేపట్టాలని, ఇలాంటి ఘటనలు రానున్న రోజుల్లో రిపీట్  కాకూడదని  జవహర్ నగర్  కార్పొరేషన్  కమిషనర్ ను ఆదేశించామని తెలిపారు. సర్వేకు సబంధించిన అప్లికేషన్ తో పాటు ఇతర వస్తువులను ట్రంకు పెట్టెలో ఉంచి ప్రభుత్వ వాహనంలో తీసుకెళ్లారని చెప్పారు.