రిజర్వేషన్ ఫలాలు అందరికీ చేరాలి : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

రిజర్వేషన్  ఫలాలు అందరికీ చేరాలి : బీసీ కమిషన్  చైర్మన్  నిరంజన్

రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: రిజర్వేషన్  ఫలాలు అందరికీ చేరాలని బీసీ కమిషన్  చైర్మన్  నిరంజన్  పేర్కొన్నారు. బుధవారం బీసీ కమిషన్  చైర్మన్, సభ్యులు రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ రాజన్నను దర్శింకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేములవాడలోని మహాలక్ష్మి, న్యూ అర్బన్ కాలనీ, సిరిసిల్లలోని ఇందిరానగర్, గీతా నగర్​లో పర్యటించారు.---పిచ్చకుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మలి తదితర కులాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ్మల కులానికి శూద్ర, నాన్  బ్రాహ్మణ్  పేరిట కులం సర్టిఫికెట్  ఇవ్వడంతో ఆలయాల్లో అర్చక, ఇతర ఉద్యోగాలు పొందేందుకు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 

గాడే వంశీయుల పేరుతో క్యాస్ట్  సర్టిఫికెట్  జారీ చేయాలని దొమ్మరి కులస్తులు విజ్ఞప్తి చేశారని చెప్పారు. పిచ్చకుంట్ల కులం పేరు మార్చి వంశరాజ్ గా మార్చాలని కోరుతున్నారని తెలిపారు. వేములవాడ, సిరిసిల్లలో దొమ్మరి, పిచ్చకుంట్ల, తమ్మల కులాల వారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. బీసీ రిజర్వేషన్  ఫలాలు అన్ని కులాల వారికి అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇబ్బందికరంగా భావించవద్దని సూచించారు. 

పిల్లలను చదివించి, రిజర్వేషన్  ఫలాలు పొందాలని సూచించారు. కులాల పేర్ల మార్పు అంశాన్ని వచ్చే నెలలో పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్  యువ వికాసం పథకాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్డీవో రాధా భాయ్, తహసీల్దార్లు విజయ్  ప్రకాశ్​రావు, మహేశ్ కుమార్, సిరిసిల్ల మున్సిపల్  కమిషనర్  సమ్మయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజ మనోహర్ రావు పాల్గొన్నారు.