కుల గణనలో క్యాస్ట్ పేరు తప్పు చెబితే క్రిమినల్ యాక్షన్: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

కుల గణనలో క్యాస్ట్ పేరు తప్పు చెబితే క్రిమినల్ యాక్షన్: బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

కరీంనగర్: కుల గణన సర్వే సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. శుక్రవారం (నవంబర్ 1)  చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో బీసీ కమిషన్ సభ్యులు కరీంనగర్‎లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన అనేది ఓ బృహత్తర కార్యక్రమమని.. ప్రజలంతా దీన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నామని ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం.. అది నిరూపించుకునేందుకే ఈ సర్వే కీలకమన్నారు. సర్వే తప్పు జరిగి బీసీల శాతం అటీటైతే తప్పు మాది కాదని... ప్రజలది, కులసంఘాలదేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడు ఇలాంటి గణన జరుగుతుందో తెలియదని సందేహం వ్యక్తం చేశారు. ఈ గణన ద్వారా బీసీలతో పాటు, అన్ని కులాల జనాభా లెక్కలు, వారి ఆర్థిక స్థితిగతులు తేలుతాయన్నారు. జనగణన విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని భావిస్తున్నామని.. అందులో భాగంగానే బీసీ కమిషన్ ఛైర్మన్‎గా నన్ను, ఇతర సభ్యులను నియమించిందని తెలిపారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా మా ముందుకు వచ్చిన విషయాలను ఉన్నదున్నట్లుగా ప్రభుత్వానికి నివేదిస్తామని స్పష్టం చేశారు. కులగణన జరుగుతున్న సమయంలో కులసంఘాలు కీలక పాత్ర పోషించాలని.. సర్వే సక్రమంగా జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. 80 వేల నుంచి 90 వేల మంది ఎన్యుమరేటర్లు జనగణనలో పాల్గొంటారని తెలిపారు.  

 ప్రజల్లో ఎవరెంత శాతమో తెలియాలంటే ప్రజల సహకారం కీలకం. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దు. అపోహలు, ఆటంకాలు సృష్టించడం మంచిది కాదు. భవిష్యత్తులో ఎవరో ఒకరు ఈ సర్వేను కూడా ఛాలెంజ్ చేస్తారు. అందుకే బీసీలకు నష్టం కలగకుండా గణన పకడ్బందీగా చేయాలి. బీహార్ లాంటి పరిస్థితి ఇక్కడ ఎదురు కాకూడదు. కర్ణాటకలో పదేళ్ల క్రితమే జనగణన చేసినా ఇంత వరకు నివేదిక బయటకు రాలేదు. ఇలాంటి పరిస్థితి రాకుండా సర్వే చేయాలని సీఎంకు సూచించాం. 

ఇప్పుడు మేం ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదు. తాయిలాల కోసం మేము పాకులాడటం లేదు. కోర్టు పట్ల మాకు గౌరవం ఉంది. కోర్టు సూచించినట్లే ముందుకు పోతాం. బీసీ కమిషన్‎కు బీసీల ఆర్థిక, సమాజిక స్థితిగతులను అధ్యయనం చేసే అధికారం ఉంది. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఒకవేళ కోర్టు అడ్డుకుంటే దాన్ని గౌరవిస్తాం. ఇటీవల కోర్టు  ఏం చెప్పిందో మా దృష్టికి రాలేదు. ఆర్డర్ కాపీ మాకు అందలేదు. న్యాయనిపుణల సలహా మేరకు ఈనెల 13 వరకు మా ప్రజాభిప్రాయ సేకరణ నిర్విఘ్నంగా కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు

ప్రజాభిప్రాయ సేకరణలో చాలా రకాల విజ్ఞప్తులు వస్తున్నాయని.. కొన్ని కులాల పేర్లు ఎప్పుడు విననవి కూడా మా దృష్టికి వస్తున్నాయని అన్నారు. చాలా మంది ఒక బీసీ గ్రూపు నుంచి మరో గ్రూపుకు మార్చాలని, ఇంకొందరు ఎస్టీల్లో, మరికొందరు ఎస్సీల్లో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. ఇన్నేళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నా మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలు మాకు ఇప్పుడు తెలుస్తున్నాయన్నారు. కొన్ని కులాల పేర్లు అవమానకరంగా ఉన్నాయని(పిచ్చకుంట్ల, దొమ్మరి) తమ కులం పేర్లు మార్చమంటున్నారని చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అందరు సహకరించాలన్నారు. 

గతంలో చేసిన సమగ్ర కుటుంబసర్వే వివరాలు ఎక్కడున్నాయో దేవునికే తెలియాలని.. ఇటీవల సీఎం సమగ్ర కుటుంబ సర్వే వివరాలు అడిగితే అధికారులెవరూ వాటి గురించి సరిగ్గా చెప్పలేదని అన్నారు. తమకు కులం పేరు అవసరం లేదని కూడా కొన్ని విజ్ఞప్తులు వచ్చాయన్నారు. అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయని తెలిపారు. బీసీల సంఖ్య ఎక్కువగా ఉందని తేలితే అగ్రవర్ణ కులాలు కూడా రియలజైతే మన హక్కులు మనకు అందాలని కోరుకునేలా సర్వే ఉండాలన్నారు.