- ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: బీసీ కమిషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీసీ కులాల లిస్ట్ లో ఉండి కేంద్ర ఓబీసీ జాబితాలో లేని 40 కులాలను వెంటనే కేంద్ర జాబితాలో కలిపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని తీర్మానించింది. ఇటీవల ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జరిపిన విచారణలో వచ్చిన వినతులపై శుక్రవారం ఖైరతాబాద్ లోని కార్యాలయంలో కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు సురేందర్, బాలలక్ష్మి, జయప్రకాశ్ రివ్యూ చేశారు. రాష్ట్ర బీసీ జాబితాలో 130 కులాలు ఉండగా, కేంద్ర ఓబీసీ జాబితాలో 90 కులాలు మాత్రమే ఉన్నాయని చైర్మన్ నిరంజన్ తెలిపారు.
కేంద్ర జాబితాలో లేని 40 కులాలను కేంద్ర జాబితాలో కలిపేందుకు రాష్ట్రం ఇదివరకే ప్రతిపాదనలు పంపినా.. ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదని చెప్పారు. గత నెల 28 నుంచి ఈ నెల 2 వరకు , ఈ నెల 18 నుంచి 26 వరకు బహిరంగ విచారణ చేపట్టామని వెల్లడించారు. బుడబుక్కల, తమ్మలి తదితర కులాల పేర్లలో మార్పులను కోరుతూ వినతులు వచ్చాయని తెలిపారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయం స్వీకరిస్తామన్నారు. కాగా.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు.. కమిషన్ తో భేటీ అయ్యారు. ముస్లింలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు, తదితర అంశాలపై వినతిత్రం సమర్పించారు.