కులగణనపై పబ్లిక్ హియరింగ్..ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్న బీసీ కమిషన్

కులగణనపై పబ్లిక్ హియరింగ్..ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్న బీసీ కమిషన్
  • ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్న బీసీ కమిషన్ 
  • 24న ఆదిలాబాద్​లో మొదటి విచారణ
  • త్వరలో జిల్లాల్లో టీచర్లకు ట్రైనింగ్, తర్వాత డోర్ టు డోర్ సర్వే
  • డేటా ఎంట్రీ, సాఫ్ట్​వేర్ బాధ్యతలు సెస్, సీజీజీకి అప్పగింత
  • రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రెండు నెలల్లో కులగణన పూర్తి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు ప్లానింగ్ డిపార్ట్​మెంట్ కసరత్తు మొదలుపెట్టింది. సర్వేకు ప్లానింగ్ డిపార్ట్​మెంట్​ను నోడల్ ఏజెన్సీగా ప్రకటిస్తూ ఇటీవల సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కులగణన కోసం ప్రభుత్వ టీచర్లతో డోర్ టు డోర్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. ఇందులో భాగంగా త్వరలో జిల్లాల్లో టీచర్లకు కులగణనపై శిక్షణ ఇవ్వనుంది. ముందుగా డోర్ టు డోర్ సర్వేలో భాగంగా పబ్లిక్ ను ఎలాంటి ప్రశ్నలు అడగాలి? ఎలాంటి వివరాలు సేకరించాలి? సంబంధిత ఫామ్​లు ఎలా నింపాలి? అనే విషయాలపై ఎన్యుమరేటర్లకు ట్రైనింగ్ ఇస్తారు.

అనంతరం డోర్ టు డోర్ సర్వేను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని అధికారులు భావి స్తున్నారు. గణనకు తక్కువ టైమ్ పడుతుందని, డేటా ఎంట్రీ, సాఫ్ట్​వేర్ ​తయారీకే ఎక్కువ సమయం పడుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. కాగా, సర్వే పూర్తయిన తర్వాత డేటా ఎంట్రీ బాధ్యతలు సెస్ (సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్)కు అప్పగించనుండగా, సాఫ్ట్ వేర్ తయారీ బాధ్యతలు సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)కి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాల పర్యటనకు బీసీ కమిషన్

కులగణనపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇత ర ప్రజాప్రతినిధులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, 
సామాన్యుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, మెంబర్లు బాలలక్ష్మి, జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, కమిషన్ ఆఫీసర్లు పర్యటించనున్నారు. ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నారు. దీని​పై నేడు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు జిల్లాల పర్యటన షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కులగణనలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు, ప్రశ్నలపై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.

బీసీ కమిషన్​తో ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ల భేటీ 

కుల గణనపై బీసీ కమిషన్​ను ప్లానింగ్ డిపార్ట్​మెం ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఓం ప్రకాశ్, స్టాటిస్టికల్ డైరెక్టర్ రిఫ్యూస్ దత్తమ్​ సోమవారం కమిషన్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కులగణన ప్రక్రియ ప్రారంభించామని కమిషన్ చైర్మన్ నిరంజన్​కు సందీప్ కుమార్ సుల్తానియా చెప్పినట్టు తెలుస్తున్నది.ఈ అంశంపై ప్లానింగ్ డిపార్ట్​మెంట్ తీసుకుంటున్న చర్యలను కమిషన్​కు తెలపాలని కోరినట్టు తెలుస్తున్నది.