- మిగిలిన ఉమ్మడి 5 జిల్లాల్లో విచారణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు రెండో విడత బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించనుంది. ఇప్పటికే తొలి విడతగా గత నెల 28 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కమిషన్ పర్యటించింది. రెండో విడతగా 18న నల్గొండ, 19న ఖమ్మం, 21న రంగారెడ్డి, 22న మహబూబ్ నగర్, 23న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో హియరింగ్ నిర్వహించనుంది.
రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా ప్రజలు, కుల సంఘాల నుంచి వినతులు, సలహాలు, సూచనలను స్వీకరించేందుకు బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న బహిరంగ విచారణకు హాజరుకాలేని వారు ఈ నెల 25, 26 తేదీల్లో ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో జరగనున్న బహిరంగ విచారణకు హాజరు కావచ్చని శనివారం ఒక ప్రకటనలో కమిషన్ సూచించింది. అంతేకాకుండా, బహిరంగ విచారణలకు వ్యక్తిగతంగా హాజరు కాలేనివారు పోస్టు ద్వారా తమ విజ్ఞాపనలను కమిషన్ కార్యాలయానికి ఈ నెల 26 సాయంత్రం 5 గంటల్లోపు చేరే విధంగా పంపాలని సూచించింది.