ఎంబీసీలకు అవకాశం ఇవ్వండి : బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్

ఎంబీసీలకు అవకాశం ఇవ్వండి : బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్
  • ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసంలో ప్రాధాన్యం ఇవ్వండి
  • ప్రభుత్వానికి బీసీ కమిషన్ వినతి
  • సంచార జాతుల పరిస్థితి దుర్భరంగా ఉందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో బీసీ కులాల్లోని నిరుపేదలకు, సంచార జాతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ విజ్ఞప్తి చేశారు. గత నెలలో తాము వేములవాడ, జగిత్యాల, సిరిసిల్ల, ఆమన్‌‌‌‌‌‌‌‌గల్‌‌‌‌‌‌‌‌, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి సంచార జాతుల ప్రజల జీవన స్థితిగతులను ప్రత్యక్షంగా చూశామని, వారి జీవనం దుర్భరంగా ఉందని ఆయన తెలిపారు. వీరికి ఇండ్లు, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

బుధవారం ఖైరతాబాద్ లోని కమిషన్ ఆఫీసులో చైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ నిరంజన్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎంబీసీ కులాల ప్రజలకు ఇండ్లతో పాటు రాజీవ్‌‌‌‌‌‌‌‌ యువ వికాసం పథకంలో భాగంగా అధిక ప్రాధాన్యత ఇస్తూ, బ్యాంకులు కూడా వారికి తోడ్పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయ కోరారు.  జాతీయ బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు ఉన్న అధికారాలను రాష్ట్ర బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీల నుంచి  తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చే విషయమై కమిషన్ కు పలు వినతులు వచ్చాయని, వీటిని పరిశీలిస్తామని చైర్మన్ వెల్లడించారు. ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కులాల సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని వెంటనే బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు నివేదిస్తే, ఆయా కులాలకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందే వరకు అందరూ ఐక్యంగా ఉండి సహాకరించాలని నిరంజన్ కోరారు.