బీసీ కమిషన్​కు వినతుల వెల్లువ

బీసీ కమిషన్​కు వినతుల వెల్లువ

నిజామాబాద్,  వెలుగు: నిజామాబాద్​లో బీసీ కమిషన్​ పర్యటన​మంగళవారం ముగిసింది. కలెక్టరేట్​లో  ఏర్పాటు చేసిన సమావేశంలో  రాజకీయ పార్టీలు, కుల, ఉద్యోగ సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యర్థనలు స్వీకరించారు. ఉమ్మడి జిల్లా నుంచి వందల సంఖ్యలో వచ్చిన ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు. వచ్చిన ప్రతీ ఒక్కరి పేరును నమోదు చేయడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేశారు. ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​ నుంచి ఉదయం 10 గంటలకు కలెక్టరేట్​లోకి  కమిషన్​ చైర్మన్ జి.నిరంజన్,​ నలుగురు సభ్యులు వచ్చారు.  తనను కలిసిన ప్రజల అభిప్రాయాలను చైర్మన్, సభ్యులు ఓపికగా విన్నారు. 

ఎన్యూమరేటర్లకు ట్రైనింగ్​

జిల్లాలో ఇంటింటి సమగ్ర సర్వే కోసం ఎన్యూమరేటర్లు, సూపర్​వైజర్లను గుర్తించామని, వారికి శిక్షణ ఇప్పిస్తామని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు కమిషన్​కు వివరించారు. ప్రతీ కుటుంబ సభ్యుడి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కులం వివరాలు సమగ్రంగా సేకరించేలా ప్రణాళిక బద్ధంగా వెళ్తామన్నారు. 

సంచార జాతులకు బోర్డు అవసరం: రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందని రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. అభిప్రాయ సేకరణలో ఆయన  పలు సూచనలు చేశారు. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్​లు వర్తింపజేయాలని కోరారు. జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్​ఏర్పాటు చేయడంతో పాటు అన్ని కుల వృత్తులకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సంచార జాతుల కోసం స్పెషల్​ బోర్డు ఏర్పాటు అవసరమన్నారు. గల్ఫ్​ వెళ్లే వారికి న్యాక్​ ద్వారా ట్రైనింగ్​ ఇవ్వాలని, గత బీఆర్​ఎస్​ పాలనలో జిల్లాలో జరిగిన మేకలు, గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయని, విచారణకు సిఫారసు చేయాలన్నారు.

లెక్కలు వెల్లడించాలి:  జిల్లా బీసీ సంక్షేమ సంఘంసమగ్ర కులగణన వివరాలు గోప్యంగా పెట్టొద్దని, ప్రజలకు తెలియపరచాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్​ కెంపుల నాగరాజ్​ కమిషన్​ను కోరారు.  బీసీ స్టడీ సర్కిల్​కు ప్రతీ జిల్లాలలో రెండెకరాల భూమి కేటాయించాలని, కాలేజీ హాస్టళ్లను రెట్టింపు చేయాలన్నారు. మహాత్యా జ్యోతిబాపూలే, ఛత్రపతి శివాజీ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలన్నారు. బీసీ లెక్కలు తేలేలా ప్రతీ విలేజ్​లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని చైర్మన్ కు నాయకులు విజ్ఞప్తి  చేశారు. 

మేదరి కులస్తులతో మాటామంతీ

ఫీల్ట్​ విజిల్​లో భాగంగా కమిషన్ చైర్మన్ నిరంజన్,  సభ్యులు తిరుమలగిరి, సురేందర్​, బాలలక్ష్మీ, రాపోలు జయప్రకాశ్​ నగరంలోని బురుడుగల్లీ వెళ్లారు. అక్కడ నివసిస్తున్న మేదరి కులస్తులతో మాట్లాడి వారి ఆర్థిక, సామాజిక పరిస్థితి గురించి తెలుసుకున్నారు.  వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కమీషన్​ను మేదరి కులస్తులు కోరారు.  కొన్ని రాష్ట్రాలలో తమను ఎస్టీలుగా గుర్తించారని తెలిపారు.  అధికారుల వెంట  జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి స్రవంతి, తహసీల్దార్​ బాలరాజు తదితరులు ఉన్నారు.