- జీహెచ్ఎంసీ కమిషనర్‌కు బీసీ కమిషన్ లేఖ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో కులగణన సర్వే వివరాలు ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ జీహెచ్ఎంసీ కమిషనర్ ను శుక్రవారం ఆదేశించారు. సర్వేను విధిగా నిర్వహించకపోవడానికి గల కారణాలపై కమిషన్ దర్యాప్తు చేయాలనుకుంటోందని, వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో నివసిస్తున్న మొత్తం జనాభా ఎంత అని, సర్వేలో కవర్ చేయబడిన మొత్తం జనాభా ఎంత, మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయని, సర్వే సమయంలో కవర్ చేసిన ఇండ్ల సంఖ్య ఎంత అనే వివరాలు అందజేయాలని ఆదేశించారు. మొత్తం ఎన్యూమరేషన్ బ్లాక్‌ల సంఖ్య, మొత్తం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల సంఖ్య, ఎన్యూమరేషన్ బ్లాక్ వారీగా ఎన్యూమరేటర్లు వారి పేర్లు, ఫోన్ నంబర్ల వివరాలు అందజేయాలని కోరారు.
రాష్ట్రంలో మొత్తం 96.9 శాతం అనగా 1,15,71,457 ఇండ్లు ఉండగా 1,12,15,134 ఇండ్ల సర్వే జరిగిందని, 3,56,323 ఇండ్ల సర్వే జరగలేదని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, గ్రేటర్ పరిధిలో సర్వే కోసం తమ ఇండ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని చాలా మంది చెబుతున్నారని, తమకు కూడా ఫిర్యాదులు వచ్చాయని, సర్వే జరగని ఇండ్లు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని, ఎందుకు సర్వే చేయలేదో వివరాలు తెలుసుకోవాలని కమిషన్ వివరాలు సేకరిస్తుందని నిరంజన్
వివరించారు.