విశ్లేషణ: అధికారాలు లేని బీసీ కమిషన్​తో ఫాయిదా లేదు

విశ్లేషణ: అధికారాలు లేని బీసీ కమిషన్​తో ఫాయిదా లేదు

కేంద్రం 2018లో మొదటిసారిగా బీసీల కోసం ప్రత్యేకంగా 102వ రాజ్యాంగ సవరణ చేస్తూ 338బి అధికరణను చేర్చింది. దీని ద్వారా జాతీయ బీసీ కమిషన్​కు శాశ్వత ప్రాతిపదికన రాజ్యాంగబద్ధ హోదా దక్కింది. ఓబీసీ కులాల జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చడం లేదా తొలగించే అధికారంతో పాటు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలును సమీక్షించే వెసులుబాటు జాతీయ బీసీ కమిషన్​కు కల్పించారు.  ఏపీ ప్రభుత్వం కూడా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన రాష్ట్ర  బీసీ కమిషన్ చట్టం రద్దు చేసి కొత్త చట్టం తెచ్చింది. జాతీయ బీసీ కమిషన్​కు ఎలాంటి అధికారాలు కల్పించారో అలాంటి అధికారాలే రాష్ట్ర బీసీ కమిషన్​కు ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం బీసీ కమిషన్​కు పరిమిత అధికారాలే ఇచ్చింది. ఏదైనా బీసీ కులాన్ని రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చడం లేదా తొలగించడం వరకే దాన్ని పరిమితం చేసింది. 

రాజ్యాంగంలో వెనకబడిన కులాలకు ఎలాంటి హక్కులు కల్పించలేదని ద్రవిడ దిగ్గజం పెరియార్ రామస్వామి నిరసన తెలుపుతూ..1950లో భారత రాజ్యాంగాన్ని మద్రాస్ నడివీధిలో కాల్చివేశారు. ఆ ఉద్యమ ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్15(4)ను చేర్చింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల(బీసీలకు) వారికి ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికి వెసులుబాటు కలిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం1968లో బీసీ కులాలను గుర్తించడానికి ప్రత్యేక చట్టం ద్వారా అనంతరామన్ అధ్యక్షతన బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 92 కులాలను వెనకబడిన తరగతులుగా గుర్తిస్తూ, నాలుగు గ్రూపులుగా వర్గీకరించి 30 శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయ్యాలని1970లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులను అధిగమించి సుప్రీంకోర్టు అనుమతితో, స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వర్సెస్ యూ.వి.యస్ బలరామ్ మధ్య జరిగిన కేసు తీర్పు ప్రకారం బీసీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించింది.1972 నుంచి 25 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చింది. తర్వాత1975లో 3 కులాలను బీసీ జాబితాలో చేరుస్తూ మొత్తం 95 కులాలను బీసీలుగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం1993లో సుప్రీంకోర్టు మండల్ కమిషన్ తీర్పు అమలులో భాగంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే బీసీ కమిషన్​కు కేవలం ఏదైనా కులాన్ని బీసీ జాబితాలో చేర్చడం లేదా తొలగించే అధికారం మాత్రమే ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం 2007లో చట్టాన్ని సవరించి బీసీ కమిషన్​కు సివిల్ కోర్టు హోదాతో పాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలును పర్యవేక్షించి, అతిక్రమణలపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించింది. 

పెరుగుతున్న బీసీ కులాలు  

ఏపీ ప్రభుత్వం 2005 నుంచి 2011వరకు జస్టిస్ దాల్వ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన బీసీ కమిషన్​ను నియమించింది. ఆ కమిషన్ బీసీ జాబితాలో అదనంగా36 కులాలను చేరుస్తూ ముస్లింలకు ప్రత్యేకంగా బీసీ–ఇ గ్రూపు ద్వారా 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఫలితంగా బీసీ జాబితాలో కులాల సంఖ్య131కి చేరింది. ఇందులో గ్రూప్ ఏ–-55,  బీ–24, సీ–-1, డీ-–37, ఇ-–14 కులాలు ఉన్నాయి. ఆ కమిషన్ పని చేసిన కాలంలో అనేక ప్రభుత్వ శాఖలను సందర్శించి రిజర్వేషన్ల అమలును పర్యవేక్షించి అతిక్రమణలను గుర్తించి,  నష్టపోయిన బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. 2016లో జీవో నెం.25 ద్వారా బీఎస్​రాములు అధ్యక్షతన తెలంగాణలో తొలి బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిషన్ అధికారాలు కత్తిరించిన ప్రభుత్వం.. కేవలం ఏదైనా కులాన్ని బీసీ జాబితాలో చేర్చడం లేదా తొలగించడం వరకే దాన్ని పరిమితం చేసింది. ముస్లింలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను 4% నుంచి10 శాతానికి పెంచాలని కమిషన్ 2017లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముస్లిం కోటాను 4% నుంచి12 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసి, కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. వాస్తవానికి రాష్ట్రాల పరిధిలోని రిజర్వేషన్లు పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం లేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆమోదం కోసం పంపి ముస్లిం రిజర్వేషన్ల కోటా పెంపును అటకెక్కించింది. ఇదే బీసీ కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తూ.. 17 డిపెండెంట్​కులాలను బీసీ జాబితాలో చేర్చాలని నివేదిక సమర్పించింది. అందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బీసీ‘ఏ’ గ్రూపులో 14 కులాలను, ‘డి’ -గ్రూపులో 3 కులాలను చేరుస్తూ.. 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 51 శాతంగా సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. అయినప్పటికీ బీసీ రిజర్వేషన్లను 29 శాతం నుంచి 50 శాతానికి పెంచకుండా బీసీ జాబితాలో కులాలను చేరుస్తూ.. వచ్చారు. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ కులాల సంఖ్య 136 కు చేరింది. ఇందులో గ్రూపు– ఏ-60, బీ–24, సి–-01, డీ–-37, ఇ-–14 కులాలు ఉన్నాయి. రాష్ట్ర బీసీ కమిషన్​కు 2016 నుంచి 2019 మధ్య కాలంలో రిజర్వేషన్ల అతిక్రమణలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. అధికారాలు లేకపోవడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోకుండానే కమిషన్​పదవీకాలం పూర్తయింది.

102 రాజ్యాంగ సవరణతో..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2018లో మొదటిసారిగా బీసీల కోసం ప్రత్యేకంగా102వ రాజ్యాంగ సవరణ చేస్తూ 338బి అధికరణను చేర్చింది. దీని ద్వారా జాతీయ బీసీ కమిషన్​కు శాశ్వత ప్రాతిపదికన రాజ్యాంగబద్ధమైన హోదా కల్పిస్తూ, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఉన్న అధికారాలను బీసీ కమిషన్​కూ కల్పించింది. జాతీయ బీసీ కమిషనుకు కేంద్ర ఓబీసీ కులాల జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చడం లేదా తొలగించే అధికారంతో పాటు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలును సమీక్షించే వెసులుబాటు కల్పించారు. బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగితే చర్యలు తీసుకునేలా సివిల్ కోర్టు అధికారాలను కూడా కల్పించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్ 2019లో ఏర్పాటు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా వేల ఫిర్యాదులను పరిష్కరించింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు 27% అమలు చేసేలా చర్యలు తీసుకుంది. ఓబీసీ కులాలపై జరుగుతున్న దాడులను నిరోధించే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం102వ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన రాష్ట్ర  బీసీ కమిషన్ చట్టం రద్దు చేసింది. కొత్త చట్టం తెచ్చి అమలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్​కు ఎలాంటి అధికారాలు కల్పించారో ఏపీ బీసీ కమిషన్​కు అలాంటి అధికారాలే కల్పించింది. ఏదైనా కులాన్ని రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చడం లేదా తొలగించడంతో పాటు రిజర్వేషన్ల అమలు తీరును సమీక్షించే అధికారం, బీసీ కులాలపై జరుగుతున్న అత్యాచారాలను విచారించే అధికారం కల్పించింది. కానీ తెలంగాణలో బీసీ కమిషన్​కు ఎలాంటి అధికారాలు లేకుండా చేయడం వల్ల బీసీలకు న్యాయం జరిగే అవకాశం లేకుండా పోయింది.

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి..

తెలంగాణ రాష్ట్ర మొదటి బీసీ కమిషన్ పదవీకాలం 2019లో ముగిసింది. తర్వాత 2021లో జీవో నెం.240 ద్వారా రెండో బీసీ కమిషన్​ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ కమిషన్​కు ఏదైనా బీసీ కులాన్ని రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చడం లేదా తొలగించడం వరకే పరిమితం చేసింది. విధివిధానాలు తదుపరి ఉత్తర్వులో తెలియజేస్తామని తెలిపింది. అందులో భాగంగానే నిరుడు నవంబర్ 16న నివేదిక సమర్పించడానికి ఎలాంటి కాలపరిమితి లేకుండా జీవో నం.9ని జారీ చేస్తూ, బీసీ కమిషన్​కు విధివిధానాలను ఖరారు చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కులాల జీవన స్థితిగతులు, కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కులాల పరిస్థితి, వంశపారంపర్య కులవృత్తులు కోల్పోయిన కులాలకు ప్రత్యామ్నాయ వృత్తులను ఏర్పాటు చేసే విధానం, బీసీ కులాల వారీగా ఉద్యోగుల సంఖ్యను లెక్కగట్టడం, బీసీ రిజర్వేషన్లను 29 శాతం నుంచి జనాభా ప్రాతిపదికన పెంచాలనే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కమిషన్​కు సూచించింది. మరోవైపు రాష్ట్రంలోని ఎంబీసీ, సంచార జాతి, నిమ్న సేవా కులాల వారిపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. బీసీ రిజర్వేషన్లు విద్యాసంస్థల్లో, ఉద్యోగ నియామకాల్లో సక్రమంగా అమలు చేయడం లేదని వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ, ప్రస్తుత బీసీ కమిషన్​కు వాటిని పరిష్కరించడానికి అధికారాలు లేకపోవడం వల్ల బీసీ కులాలకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి వెంటనే తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ చట్టాన్ని సవరించాలి. కమిషన్​కు రిజర్వేషన్ల అమలులో జరిగే అతిక్రమణలను అడ్డుకునే అధికారం, బీసీలపై జరుగుతున్న దాడులపై విచారించేలా సివిల్ కోర్టు అధికారాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- కోడెపాక కుమార స్వామి 
రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ విద్యుత్ 
బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం