విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా ..ఏకగ్రీవంగా ఆమోదించిన సభ

విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా ..ఏకగ్రీవంగా ఆమోదించిన సభ
  • రెండు వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం 
  • అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం: సీఎం రేవంత్ 
  • కేసీఆర్​ తో  పాటు అన్ని పార్టీల లీడర్లు కలిసి వస్తే ప్రధానిని కలుద్దాం 
  • ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకుందాం 
  • రిజర్వేషన్ల పెంపు ఎట్ల సాధ్యం కాదో చూద్దాం
  •  రాష్ట్రంలో బీసీలు 56.36 శాతం ఉన్నట్లు తేలింది 
  • మేం చేపట్టిన కులగణన లెక్క వంద శాతం కరెక్ట్ 
  • అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన 
  • బిల్లులను ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం 

హైదరాబాద్. వెలుగు: చరిత్రాత్మక బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమో దించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రూపొందించిన రెండు వేర్వేరు బిల్లులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించింది. 

శాసన మండలిలోనూ ఈ బిల్లులను ఆమోదించడం లాంఛనమే. తర్వాత గవర్నర్​ కు . అటు నుంచి రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తాయి. ఇవి చట్టరూపం దాలిస్తే బీసీల ఏండ్లకల నెరవేరుతుంది. ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో బీసీలకు అవకాశాలు పెరుగుతాయి. ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు, పెద్ద సంఖ్యలో సర్కారు కొలువులు దక్కుతాయి. ఇటు స్థానిక సంస్థల్లోనూ పార్టీల దయాదాక్షిణ్యాలతో సంబంధం లేకుండా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలవుతాయి. 

సీఎం రేవంత్​ రెడ్డి అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు  కలిసి రావాలని ఆయన కోరారు. "బీసీ రిజర్వే షన్లు పెంచేందుకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ సభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కోరుతున్నా, రాహుల్ గాంధీని కూడా కలిసి పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుదాం, రాహుల్ గాంధీని సమయం తీసు కోవాల్సిందిగా మా పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్​ కు  బాధ్యత అప్పగిస్తున్నా. 

కులగణన సర్వేలో పొందుపరిచిన బీసీల లెక్క వందశాతం సరైంది. బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదు. కా మారెడ్డి ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నాం" అని సీఎం తెలిపారు. "అందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు? ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదిం చుకునేలా ప్రయత్నం చేద్దాం. ఈ బాధ్యత అన్ని పార్టీలపై ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ రిజ ర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మేం బాధ్యతలు చేపట్ట గానే బీసీకులగణన ప్రక్రియను మొదలు పెట్టాం. కులసర్వేలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలి యజేస్తున్నా" అని పేర్కొన్నారు. 

దేశానికే ఆదర్శంగా తెలంగాణ 

బ్రిటిష్ కాలంలో కులగణన జరిగిందని, ఆ తర్వాత తెలంగాణలో కులగణన పేరుతో ఇప్పుడు జరిగిందని, రాష్ట్ర జనాభాలో 56.36% మంది బీసీలు ఉన్నట్లు తేలిందని సీఎం రేవంత్ వివరించారు. జెండాలను, ఎజెండాలను పక్కన పెట్టి అన్ని పార్టీలూ కులగణనకు మద్దతు తెలపడం ద్వారా దేశానికే ఒక మంచి సందే శాన్ని ఇచ్చినట్లయిందని, భవిష్యత్తులోనూ ఈ సంప్రదాయం కొనసాగాలని ఆయన కోరారు. 

రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడు తరహాలో తెలంగాణకూ గ్యారంటీ లభించేలా ప్రతిపక్షాలు కలిసి వస్తాయనే నమ్మకం కలిగిందన్నారు.ఇదే టీమ్ స్పిరిట్ ప్రదర్శిస్తే పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణతో ఎందుకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. 1979లోనే బీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ వేశారని గుర్తు చేశారు. మండల్ కమిషన్ నే బీసీ రిజర్వేషన్లకు చట్టబ ద్ధత అని ఆయన పేర్కొన్నారు.


బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 67% రిజర్వేషన్లు 

విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. వీటి ప్రకారం బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం ఉన్నది. దీంతో మొత్తంగా రిజర్వేషన్లు 67 శాతానికి చేరనున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే మరో బిల్లుకూ శాసనసభ ఆమోదం తెలిపింది.

 బీసీ, ఎస్టీ, ఎస్టీలు విద్య, సామాజికంగా వెనకబడినట్లయితే ఆర్టికల్ 15 ప్రకారం ప్రత్యేక నిబంధన కింద విద్యాసంస్థల్లో ప్రవేశాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో బీసీలకు ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేదని గుర్తిస్తే.. ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం వారికి రిజర్వేషన్ చేసేందుకు ప్రత్యేక నిబంధన చేసే చాన్స్ ఉందని, ఆ ప్రకారమే తాము చేస్తున్నట్లు పేర్కొంది.

 మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించడంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉటంకించింది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం మించాలని అనుకుంటే. సరైన డేటాతో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపిందని పేర్కొంది. ఆ ప్రకారమే డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి కుల గణన సర్వేచేసి బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరిస్థితులను తెలుసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది.
 

ఈ సర్వే నివేదికను రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదించి.. ఆ మేరకు బీసీ రిజర్వేషన్ల బిల్లులను తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం బీసీలకు 2017లో 29 శాతం నుంచి 37 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందని... అబిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర ఉన్నదని.. దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. దాన్ని స్థానంలో 42శాతం రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులు తీసుకొస్తున్నట్లు పేర్కొంది. 

బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదన పంపించింది. దాన్ని గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి దగ్గర ఉన్న ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుని కొత్త ప్రతిపాదన పంపిస్తున్నాం. అందరినీ సంప్రదించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లులను తీసుకొచ్చాం. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా. బీసీ రిజర్వేషన్ల సాధనకు నాయకత్వం వహిస్తా. అఖిలపక్ష నాయకులు అందరం కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దాం. బీసీ రిజర్వేషన్లు 42శాతం పెంచేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుందామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.