సీఎం పీఠం ఇక బీసీదేనా?

అధికారంలోకి వస్తే తెలంగాణకు దళితుడే మొదటి సీఎంగా ఉంటారని టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు గతంలో అన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ నేతలు సహా చాలా మంది మేధావులు మొదటి సీఎంగా కేసీఆరే ఉండాలని గొంతెత్తారు. ఆ విధంగా గొంతెత్తే పరిస్థితులు సృష్టించ బడ్డాయి. ఎన్నికలకు ముందే దళిత ముఖ్యమంత్రి అన్న ప్రతిపాదన బుట్టదాఖలైంది. టీఆర్ఎస్​ పార్టీ రెండోసారి అత్యధిక మెజార్టితో అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా దళితుడు సీఎం కాలేకపోయాడు. ఎందుకు కాలేక పోయాడన్న విషయం గురించి ఇప్పుడు శోధన అవసరం లేదు. ఆ తర్వాత కొంత కాలానికి సీఎం పదవి నుంచి కేసీఆర్ ​తప్పుకుంటారని, ఆయన కుమారుడు కేటీఆర్ ​సీఎం అవుతారన్న వార్తలు గుప్పుమన్నాయి. కారణాలు తెలియదు కానీ అది వాస్తవ రూపంలోకి రాలేదు. ఇప్పుడు రకరకాల చర్చలు ముందుకొస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ​ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్ ​కేసీఆర్​కు ఓ సవాల్​విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేయాలన్నది ఆయన సవాల్ ​సారాంశం. అక్కడితో ఆయన ఊరుకోలేదు. కాంగ్రెస్​ మాత్రమే దళితుడిని సీఎం చేస్తుందని, అందుకు ఉదాహరణగా పంజాబ్ ​రాష్ట్రమని చెప్పుకొచ్చారు. అయితే అక్కడ జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అది వేరే విషయం అనుకోండి.

పోటీ మూడు పార్టీల మధ్యే..

తెలంగాణలో బీసీలు, షెడ్యూల్డ్​కులాలు, తెగలకు సంబంధించిన ప్రజలే అత్యధికం. వారి సంఖ్య 85 శాతానికి మించి ఉంటుంది. ఆ వర్గాల నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందా? అలాంటి పరిస్థితి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏర్పడుతుందా? ఇది చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న. రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలుగా ఉండగా, బహుజన సమాజ్​పార్టీ, వైఎస్సార్ టీపీ వీటి తర్వాతి స్థానంలో ఉన్నాయి. టీఆర్ఎస్​కు అధ్యక్షుడిగా కేసీఆర్ ఉండగా, కాంగ్రెస్​కు రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఓట్ల రీత్యా తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీల అధ్యక్షులిద్దరూ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే. బీజేపీలో మాత్రం బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్​ అధ్యక్షుడిగా ఉన్నారు. వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తే. కాగా దళిత వర్గానికి చెందిన మాజీ పోలీస్​ఆఫీసర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ బహుజన సమాజ్​పార్టీకి రాష్ట్ర బాధ్యులుగా ఉన్నారు. తెలంగాణలో బీఎస్పీ కొంత ప్రభావం చూపించే అవకాశం ఉన్నా.. వైఎస్సార్టీపీ ఉనికి ప్రశ్నార్థకమే! ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్​ మూడు పార్టీల మధ్యే ఉంటుంది. ఈ త్రిముఖ పోటీలో టీఆర్ఎస్​ కే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ శ్రేణుల అంచనా. అలాంటి పరిస్థితి ఉండదని మిగతా వారు అంటున్నారు. అందుకు ఉదాహరణగా మొన్న జరిగిన హుజూరాబాద్​ ఎన్నికను చూపిస్తున్నారు. ఆ ఎన్నికల్లో డబ్బులు ప్రధాన పాత్ర పోషించినా ఫలితం మరో విధంగా వచ్చిందనేది వాళ్ల వాదన.

ఇప్పటి దాకా ఒక్క బీసీ సీఎం లేడు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​సహా తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా బీసీల నుంచి ముఖ్యమంత్రి లేకపోగా.. ఉమ్మడి రాష్ట్రంలో సంజీవయ్య ఒక్కరే దళిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అది కూడా రెండేండ్ల రెండు నెలలు మాత్రమే. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు అగ్రకులాలకు చెందిన వ్యక్తులను కాకుండా ఇతరులను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. అయితే దళిత ముఖ్యమంత్రి లేదా బీసీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. దళితుడిని సీఎంగా ఈ మూడు ప్రధాన పార్టీలు ప్రకటిస్తాయా అనేది అంత రూఢీగా లేదు. టీఆర్ఎస్ ​పార్టీ దళితుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందా? అని మాణిక్కం ఠాగూర్​ సవాలు విసిరారు. కానీ తమ పార్టీ వైఖరి ​ఏమిటో చెప్పలేదు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్​ దళితుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదు. ఒకవేళ టీఆర్ఎస్ ​ప్రకటించినా.. దాన్ని నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్​ ఆ విధంగా ప్రకటిస్తుందన్న నమ్మకం ఎంత మాత్రమూ లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. ఆ అవకాశాలు ఉన్నదల్లా ఒక్క బీజేపీలోనే, ముందు వరుస నాయకుల్లోంచి ఎవరో ఒక బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించవచ్చు అన్నది నా అంచనా.

ఆ రెండు పార్టీలు బీసీని సీఎం చేస్తయా?

కాంగ్రెస్​పార్టీ సీఎం అభ్యర్థి పేరును ఎన్నికల ముందు ప్రకటించకపోయినా.. ఒక వేళ ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం అయ్యే అవకాశం రేవంత్​రెడ్డికే ఉంటుంది. లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికి ఉంటుంది. టీఆర్ఎస్​గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేసీఆరే సీఎం అభ్యర్థిగా ఉంటారు. లేదంటే ఆయన కుమారుడు కేటీఆర్​ సీఎం అభ్యర్థిగా వస్తారు. బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ ముందుకొస్తే ఎన్నికలు ఎలా ఉంటాయి? ప్రజలు ఎలా స్పందించే అవకాశం ఉందనేది ప్రశ్న. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఆ రెండు అగ్రవర్ణాలకు ఓటు వేసే పరిస్థితి ఎంత మాత్రం కనిపించడం లేదు. రైతు బంధులను, పెన్షన్లను, దళితబంధులను కాదు.. ప్రజలు రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నారు. ఎంత డబ్బు వెదజల్లినా ఫలితం ఇదే ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. త్రిముఖ పోటీలో టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందన్న వాదనలో ఎలాంటి బలం లేదు. ప్రజలు తెలివైనవారు.. వారి ఓట్లను ఎప్పుడూ వృథా చేసుకోరు. గెలవడానికి ఏ పార్టీకి అవకాశం ఉందో ఆ పార్టీకే ఓటు వేస్తారు. అభ్యర్థి సామాజిక నేపథ్యం కూడా ఓటర్లని ప్రభావితం చేస్తుంది. తెలంగాణలో తర్వాతి ముఖ్యమంత్రి బీసీ అయి ఉంటాడు. ఇది చాలా మంది భావన. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్, కాంగ్రెస్​లు కూడా తమ సీఎం అభ్యర్థిగా బీసీ వ్యక్తిని ప్రకటించాలి. అప్పుడే అవి గట్టి పోటీ ఇవ్వగలవు. అంత సాహసం ఆ పార్టీలు చేస్తాయా? సందేహమే!.

- మంగారి రాజేందర్,

విశ్రాంత జిల్లా జడ్జి