
- 7 లక్షలకు చేరిన అప్లికేషన్లు
- రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు
- బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని బీసీ కార్పోరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తెలిపారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని వారు మీసేవా నుంచి తీసుకున్న ఇన్ కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబర్ ను అందించాల్సి ఉంటుందని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
క్యాస్ట్ , ఇన్ కమ్ సర్టిఫికేట్ల కోసం మీ సేవా కేంద్రాల్లో లక్షల మంది అప్లై చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టతను ఇచ్చింది. అలాగే, 2016 తర్వాత మీసేవా కేంద్రాల ద్వారా జారీ అయిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని, కొత్త సర్టిఫికేట్ కోసం మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని మల్లయ్య భట్టు తెలిపారు. దరఖాస్తుదారుల సౌకర్యం కోసం మండల, మున్సిపల్ కార్యాలయాలలో గల ప్రజాపాలన సేవా కేంద్రాల్లో యువ వికాసం అప్లికేషన్ ఫాంలను అందుబాటులో ఉంచామని, వాటిని ఫిల్ చేసి అక్కడే ఇవ్వాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం మండల, మున్సిపల్ అధికారులను సంప్రదించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ నెల 14 వరకు అప్లై చేసుకోవచ్చన్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, క్రిస్టియన్లు యువ వికాసం స్కీమ్ కు దరఖాస్తు ఎండీ సూచించారు.