బీసీ డిక్లరేషన్‍ వెంటనే అమలు చేయాలి.. ఫిబ్రవరి 2న హనుమకొండలో బీసీ యుద్ధభేరి సభ

బీసీ డిక్లరేషన్‍ వెంటనే అమలు చేయాలి.. ఫిబ్రవరి 2న హనుమకొండలో బీసీ యుద్ధభేరి సభ
  • నల్గొండ టీచర్‍ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్‍ అభ్యర్థి, బీసీ నేత సుందర్‍రాజ్‍ యాదవ్‍ డిమాండ్
  •  అన్ని ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలి 


వరంగల్‍, వెలుగు: పార్టీలకు అతీతంగా బీసీలంతా ఒక్కటయ్యారని,  ఇక నుంచి ఓట్లు..  సీట్లు తమవే నంటూ కుడా మాజీ చైర్మన్‍, వరంగల్‍, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్‍ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్‍రాజ్‍ యాదవ్‍ పేర్కొన్నారు. ఈనెల 2న హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్‍ సైన్స్ కాలేజీ గ్రౌండ్‍లో  నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధభేరి సభపై శుక్రవారం బీసీ సంఘాల నేతలతో కలిసి ఆయన  ప్రెస్‍మీట్‍ లో మాట్లాడారు. 77 ఏండ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలపై వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. 

కాంగ్రెస్‍ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‍ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించాలని కోరారు. ఉన్నతవర్గాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్‍ రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నిస్తూ, వెంటనే తీసివేయాలని డిమాండ్ చేశారు.  బీసీ రాజకీయ యుద్ధభేరి సభ ఆరంభం మాత్రమేనని, అన్ని జిల్లాల్లో  ఏర్పాటుచేసి.. చివరగా హైదరాబాద్‍ లో 10 లక్షల మందితో నిర్వహిస్తామన్నారు. 

లక్ష మంది బీసీలతో నిర్వహించే వరంగల్ సభకు జాతీయ పార్టీల బీసీల నేతలైన డీఎంకే ఎంపీ విల్సన్‍, ఆర్జేడీ ఎంపీ మీసా యాదవ్‍, ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‍తో పాటు ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్‍, సిరికొండ మధుసూదనచారి, బస్వరాజు సారయ్య, తీన్మార్‍ మల్లన్న, సినీ నటుడు సుమన్‍ తదితర నేతలు హాజరవుతున్నారన్నారు. 32 ఏండ్లుగా విద్యా వ్యవస్థలో సేవలు అందిస్తూ.. పలు సమస్యలపై పోరాడుతున్నానని టీచర్‍ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు అశోక్‍, యాదగిరి గౌడ్‍, రాజయ్య, వేణు గౌడ్‍, రజినీ కాంత్‍ తదితరులు పాల్గొన్నారు.