సామాజిక న్యాయం జరగాలంటే..బీసీ డిక్లరేషన్​ అమలు కావాలి

తెలంగాణ వచ్చిన తర్వాత కొన్నేండ్లుగా రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలు, ఎంబీసీలు, సంచార జాతుల వారు అత్యంత అలజడికి గురవుతున్నారు. తమ అస్తిత్వ పోరాటాలను కూడా పక్కనపెట్టి తెలంగాణ ఉద్యమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న బీసీలు.. తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరి అందరూ సమాన గౌరవంతో జీవించవచ్చనుకున్నారు. అధికారంలో అన్ని కులాలకు భాగస్వామ్యం లభిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక స్వావలంబన లభిస్తుందని తమ ఉన్నత విద్య, ఉద్యోగం, సామాజిక హక్కులకు పూర్తి రక్షణ ఉంటుందనుకున్న భావనలు ఒక్కొక్కటి మంచులా కరిగిపోయాయి. ఈ క్రమంలోనే మండల్‌‌‌‌ నివేదికలో ఒకప్పుడు పేర్కొన్నట్లు బీసీ కులాల మెదళ్లలో ఒక విధమైన యుద్ధం మొదలైంది. 

అది విస్ఫోటనంలా పేలి దావానలంలా వ్యాపించే క్రమం ఇంకెంతో దూరంలో లేదనిపిస్తున్నది. తెలంగాణలో అత్యంత మెజారిటీగా ఉన్న బీసీ కులాలు75 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అర్ధ బానిస బతుకులు ఇంకెంత కాలం గడపాలన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీల సాధికారత కోరుకుంటున్న తెలంగాణ ఉద్యమకారులు, బీసీ, హక్కుల ఉద్యమాల్లో, ఉద్యోగుల, కార్మికుల, రైతుల, వృత్తిదారుల, ఉపాధ్యాయ పోరాటాల్లో పాల్గొన్నవారు, బీసీ రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, అడ్వకేట్స్‌‌‌‌, డాక్టర్లు ఇలా అనేక రంగాల్లో అనేక సమస్యలకు, బాధలకు గురవుతున్నవారు తిరిగి ఏకం కాబోతున్నారు. రాజ్యాంగమిచ్చిన తమ హక్కుల పరిరక్షణకు, పాలనలో తమ భాగస్వామ్యానికి, తెలంగాణ ఉద్యమంలోని తమ ఆకాంక్షల సాధనకు అందరూ మళ్లీ సమష్టిగా ఉద్యమాలను నిర్మించడానికి అవసరమైన వేదికల ఏర్పాటు అవసరమని భావిస్తున్నారు. 

స్వాతంత్ర్యం తర్వాత కూడా..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆజాదీ కా అమృత్‌‌‌‌ మహోత్సవాల’ పేరుతో వేడుకలు నిర్వహించాయి. ప్రభుత్వాల మాట అటుంచితే, ప్రజలకు సంబంధించినంత వరకు అందరూ ఒకే స్థితిలో లేరు. క్రెడిట్‌‌‌‌ స్యూజ్‌‌‌‌ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో పది లక్షల డాలర్లకు పైగా సంపద కలిగిన వారిలో పైభాగంగా ఉన్న ఒక శాతం కుటుంబాలు మొత్తం దేశ సంపదలో 50 శాతంపైగా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. వాళ్లు సంబురాలు జరుపుకోవడంలో సహజంగానే ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అభివృద్ధి ఫలాలు కనీస స్థాయిలో అందక బీసీల్లో అత్యధిక సంఖ్యాకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటప్పుడు వారికి అమృతోత్సవాలు ఒక పండుగలా ఎలా అనిపిస్తాయి. 

స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి వేసిన ప్రగతి(ప్రణాళికలు), చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చు చేసిన అనేక లక్షల కోట్ల రూపాయల వల్ల కలిగిన ప్రయోజనాలు సమాజంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలకు “లక్ష్య ప్రకటన” చేసిన విధంగా ఒకే మాదిరిగా లేవు. స్వాతంత్ర్యానికి ముందు ఎలాగైతే ఉన్నత సామాజిక హోదాను, అధికారాన్ని, అభివృద్ధిని అనుభవించిన కొన్ని కులాలకు చెందిన ప్రజలు స్వాతంత్ర్యం తర్వాత కూడా అదే క్రమంలో వారు మరింత హోదాను, మరింత తిరుగులేని అధికారాన్ని, మన కండ్లకు కూడా ప్రస్ఫుటంగా కనపడే అమోఘమైన అభివృద్ధిని సాధిస్తే, తరతరాలుగా దోపిడీకి, పీడనకు గురైన కింది కులాల ప్రజలు నిరంతర వివక్షకు, అవమానాలకు, అసమానతలకు గురవుతూ మరింత కిందకు దిగజారిపోయే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

రాజకీయ అధికారం ఏది?

అదే విధంగా మౌలిక ఉత్పత్తి వనరులైన భూమి, ఇతర ప్రకృతిసిద్ధ వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, ఉత్పత్తి, పంపిణీ, మార్కెట్లు, వ్యాపార, వాణిజ్యాలు, సాంకేతిక వ్యవస్థలు, బ్యాంకింగ్‌‌‌‌, ఇన్సూరెన్స్‌‌‌‌ సంస్థలు, కాంట్రాక్టులు, విద్య, వైద్యం తదితర సర్వీసు రంగాలు, ఐటీ, సమాచార, సాంకేతిక వ్యవస్థలు, మీడియా, సినిమా, ఇతర ఎంటర్టైన్​మెంట్‌‌‌‌ రంగాలు, టూరిజం, హోటల్‌‌‌‌, హాస్పిటాలిటీ రంగాలు ఇలా చెప్పుకుంటూపోతుంటే అనేక నూతన, ఆర్థిక, సాంకేతిక వ్యవస్థలను ఈ 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం ఎవరి చేతిలో పెట్టిందో గమనించాలి? అందులో బీసీల వాటా ఎంత? అన్న విషయాలు పరిశీలించి అలా ఉండడానికి కారణాలేమిటో మనం తెలుసుకుని విశ్లేషించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 

ప్రభుత్వ విధానాల వల్ల బీసీలకు జరిగిన నష్టం ఏమిటి? ఈ విధానాలు ఏ కులాలకు, ఏ స్థాయిలో ఉపయోగపడ్డాయో, అలా ఎందుకు జరిగిందో కూడా విశ్లేషించాల్సిన అవసరముంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి నమూనాలు, సిద్ధాంతాలు, వ్యూహాలు, బీసీల అభివృద్ధికి ఏమాత్రం దోహదకారి కావు. పైగా ఆ నమూనాల వల్ల బీసీల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసానికి గురైంది. ప్రభుత్వ అంగాలైన చట్టసభలు, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల్లో బీసీలు 75 ఏండ్ల తర్వాత కూడా కనీస స్థాయిలో కూడా లేకపోవడం చూస్తే సామాజిక ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఇంకా కలగానే మిగిలిపోయే ప్రమాదముందని అనిపిస్తుంది. రాజకీయ అధికారం కూడా అన్ని స్థాయిల్లో వేళ్ల మీద లెక్కపెట్ట గలిగిన కొన్ని అధిపత్య కులాల, కుటుంబాల చేతుల్లో ఉండటం గమనార్హం.

జూన్‌‌‌‌ 11న బీసీ డిక్లరేషన్​

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జూన్‌‌‌‌ 11న హైదరాబాద్‌‌‌‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌‌‌‌లో అనేక మంది న్యాయమూర్తులు, కేంద్ర ఓబీసీ కమిషన్‌‌‌‌ పూర్వ అధ్యక్షులు, సామాజిక శాస్త్రవేత్తలు, ఇతర మేధావులు కలిసి ప్రధానంగా జస్టిస్‌‌‌‌ ఎం.ఎన్. రావు, జస్టిస్‌‌‌‌ వి. ఈశ్వరయ్య, జస్టిస్‌‌‌‌ వి. చంద్రకుమార్‌‌‌‌, ప్రొఫెసర్‌‌‌‌ సూరజ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ మండల్‌‌‌‌, శ్రీ చౌదరి వికాస్‌‌‌‌ పటేల్‌‌‌‌, ప్రొఫెసర్‌‌‌‌ ఇనుకొండ తిరుమలి తదితరులు బీసీల సమస్యల పరిష్కారానికి, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా “బీసీ డిక్లరేషన్‌‌‌‌” డాక్యుమెంట్‌‌‌‌ను విడుదల చేయనున్నారు. సామాజిక న్యాయం -సామాజిక ప్రజాస్వామ్యం ఈ దేశంలో అమలు కావాలంటే.. బీసీ డిక్లరేషన్‌‌‌‌ అమలు తప్పనిసరి అని పాలక పక్షాలు ఇప్పటికైనా భావిస్తారని ఆశిద్దాం.

ఆకలి చావులు.. ఆత్మహత్యలు..

ఒకప్పుడు ప్రణాళికా సంఘం చెప్పినట్లు సగటు మానవుడికి కావాల్సిన పౌష్టి కాహారం, పరిసరాల శుభ్రత కలిగిన “గృహవసతి, స్వచ్ఛమైన తాగునీరు”, ఏడాది పొడుగునా ఆదాయం ఇచ్చే ఉపాధి, విద్య, ఆరోగ్యం లాంటి కనీస అవసరాలు తీరి గౌరవప్రద జీవితం గడిపే అవకాశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 70 శాతం బీసీలకు ఇంకా ఎందుకు లభించలేదు అన్నది సమా ధానం దొరకని ప్రశ్న. వాస్తవానికి సాంప్రదాయ వృత్తుల విధ్వంసం వల్ల బీసీలు ఉపాధి కోల్పోయి, అప్పులపాలై కుటుం బాలు విచ్ఛిన్నమై ప్రత్యామ్నాయం లేక దూరప్రాంతాలకు వలసలకు పోవడం అవిచ్భిన్నంగా కొనసాగింది. ఆకలి చావులకు, ఆత్మహత్యలకు పాల్పడే వారి లో 70 శాతానికి పైగా బీసీలేనని అధ్య యనాలు చెప్తున్నాయి. ప్రభుత్వాలు ఈ అంశాన్ని ఎందుకు సీరియస్‌‌‌‌గా తీసుకోలేదో ప్రశ్నించాల్సి ఉంది

- ప్రొ. కె. మురళి మనోహర్‌‌‌‌,దేవళ్ల సమ్మయ్య