బీసీల రిజర్వేషన్లు పెంచేలా రిపోర్ట్ ఇవ్వండి : బీసీ సంఘాలు

బీసీల రిజర్వేషన్లు పెంచేలా రిపోర్ట్ ఇవ్వండి  : బీసీ సంఘాలు
  • డెడికేటెడ్ కమిషన్​కుసంఘాలు, నేతల వినతి
  • బీఆర్ఎస్ నుంచి వినతిపత్రం ఇచ్చిన స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్
  • నేడు రంగారెడ్డి కలెక్టరేట్​లోపబ్లిక్ హియరింగ్

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేలా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని బీసీ సంఘాలు, మేధావులు, పలువురు పార్టీల నేతలు బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్ ను కోరారు. మొత్తం జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో వివక్ష జరుగుతోందని, ప్రభుత్వ స్కీములు అన్నివర్గాలకు అందడం లేదని నేతలు తమ వినతిపత్రాల్లో పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లను అన్యాయంగా తగ్గించారని, దీని వల్ల లోకల్ బాడీల్లో వేలాది మంది రాజకీయంగా నష్టపోయారని పలువురు కుల సంఘాల నేతలు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లో రెండో రోజు పబ్లిక్ హియరింగ్ నిర్వహించగా రిజర్వేషన్లు పెంచాలని సుమారు 48 సంఘాలు కమిషన్ చైర్మన్ కు వినతిపత్రాలు అందజేశాయి. తొలి రోజు ఐదు వినతిపత్రాలు రాగా, రెండో రోజు 48 వచ్చినట్టు కమిషన్ వర్గాలు తెలిపాయి. 

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలు వెనుకబడే ఉన్నారు: మధుసూదనా చారి

దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీలు వెనుకబడే ఉన్నారని శాసనమండలి ప్రతిపక్షనేత  మధుసూదనా చారి అన్నారు. బీసీలకు జనాభాకు అనుగుణంగా నిధులు రావడం లేదని ఆయన గుర్తుచేశారు. ‘మేం ఎంత ఉన్నామో.. మాకు అంత వాటా రావాలి’అని ఆయన కోరారు. మంగళవారం మధుసూదనచారి ఆధ్వర్యంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మధుసూదనా చారి మాట్లాడుతూ.. లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని చైర్మన్ ను కోరామన్నారు. కులగణనలో అవసరం లేని వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారని, ఇది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. కులగణనలో అన్ని ప్రశ్నలు ఎందుకని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తున్నపు ఆస్తులు, అప్పులు, రాజకీయ పదవులు ఎందుకుఅడుగుతున్నారన్నారు.  

నేటి నుంచి జిల్లాల పర్యటనకు బీసీ డెడికేటెడ్ కమిషన్..

బీసీ డెడికేటెడ్ కమిషన్ బుధవారం జిల్లాల పర్యటనకు వెళ్లనుంది. తొలిరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ (కొంగరకలాన్) లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించనుంది. ఇందులో వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు వచ్చి వినతిపత్రాలు ఇవ్వాలని కమిషన్ సూచించింది. ఇతర జిల్లాల పర్యటన వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.