బీసీ డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణకు టైమ్ ఫిక్స్

హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్​ కమిషన్ పబ్లిక్ హియరింగ్  నిర్వహించనుంది. మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్‎లోని కమిషన్ కార్యాలయంలో ఈ నెల11వ తేదీ ఉదయం 11.30 నుంచి 3.30 వరకు వివిధ వర్గాల​నుంచి వినతిపత్రాలు, సలహాలు, సూచనలు స్వీకరించనుంది. 12న ఎన్జీవోలు, కుల సంఘాలు, మేధావులు వచ్చి వినతిపత్రాలు ఇవ్వొచ్చని డెడికేటెడ్ కమిషన్ సెక్రటరీ సైదులు శనివారం తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది.

సిబ్బందిని కేటాయించాలని లేఖ

డెడికేటెడ్ కమిషన్‎కు ఇప్పటివరకు చైర్మన్, సెక్రటరీని మాత్రమే నియమించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, బీసీ వెల్ఫేర్ శాఖకు సంబంధించిన సీనియర్ ఉద్యోగులను కేటాయించాలని ప్రభుత్వానికి కమిషన్  లేఖ రాసింది. సుమారు 12 మంది ఉద్యోగులు అవసరమని కమిషన్ అంచనా వేసింది. బీసీ రిజర్వేషన్లు, వెనుకబాటుతనం వంటి అంశాలపై నిష్ణాతులైన రీసెర్చ్ స్కాలర్ల సేవలను కూడా రిపోర్టు తయారీలో ఉపయోగించుకోవాలని కమిషన్ నిర్ణయించింది.

ఈ నెల 30 కల్లా రిపోర్టు ఇవ్వాలని జీవోలో ప్రభుత్వం పేర్కొనడంతో గడువులోపే రిపోర్టు ఇస్తామని ఇటీవల కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు ప్రకటించారు. బీసీ కమిషన్​లో ఉన్న సిబ్బందికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ కు సిబ్బందిని కేటాయించే అవకాశాలు కనపడుతున్నాయి. లోకల్ బాడీల్లో రిజర్వేషన్లపై రిపోర్టు ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ ఎంసీల్లో కూడా బీసీ రిజర్వేషన్లపై రిపోర్టు ఇవ్వాలని కమిషన్ ను ప్రభుత్వం కోరనుందని, ఇందుకు కమిషన్ గడువును పొడిగించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది.