- రూరల్, అర్బన్ లోకల్ బాడీలకు వేర్వేరుగా..
- పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ నివేదిక
- 600 పేజీలతో ఇప్పటికే సిద్ధం.. త్వరలోనే సర్కార్‌కు అందజేత
- నివేదికలో వార్డు యూనిట్‌గా కులాల వారీగా జనాభా లెక్కలు
- దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు
- ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు!
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్నివేదిక తుది దశకు చేరుకున్నది. రూరల్ లోకల్ బాడీలు (గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్), అర్బన్ లోకల్ బాడీలకు (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) వేర్వేరుగా రెండు రిపోర్టులను ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి వచ్చే నెల 1వ తేదీకి ఏడాది పూర్తి కానుంది. దీంతో మరోసారి ఇన్‌చార్జ్‌ల పాలన పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి చివరి వారంలో గానీ, మార్చి మొదటి వారంలో గానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే రిపోర్ట్ కోసం సర్కార్ నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో నివేదికను రెండు భాగాలుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రెడీ చేస్తున్నది. మొదట పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో రూరల్ లోకల్ బాడీల రిపోర్టును తొలుత సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ఈ నివేదిక 600 పేజీలతో సిద్ధమైనట్టు తెలిసింది. దాన్ని ఈ వారంలోనే సీఎం రేవంత్‌రెడ్డికి అందజేయనున్నట్టు సమాచారం.
కులాల వారీగా జనాభా లెక్కలు..
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లు ఉండగా.. ఈ 14 ఏండ్లలో 4.5 కోట్లకు చేరినట్టు అంచనా. కానీ ప్రభుత్వం దగ్గర పూర్తిస్థాయి జనాభా లెక్కలు గానీ, కులాల వారీగా వివరాలు గానీ లేవు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ, ఆ వివరాలను బయటపెట్టలేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీల లెక్కలు తీయడం ప్రస్తుత సర్కార్‌కు తప్పనిసరి అయింది. దీంతో పోయినేడాది సెప్టెంబర్ 6ననిరంజన్ చైర్మన్‌గా నలుగురు సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది.
తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర్ రావు చైర్మన్ గా, బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు సెక్రటరీగా బీసీ డెడికేటెడ్కమిషన్ను నియమించింది. నెల రోజుల్లోగా రిపోర్ట్ అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం పోయినేడాది నవంబర్6 నుంచి డిసెంబర్10 వరకు ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే–2024’ పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో కమిషన్ గతేడాది నవంబర్, డిసెంబర్నెలల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ వివిధ కుల సంఘాలు, మేధావులు, సామాన్యుల నుంచి 650 వినతిపత్రాలు స్వీకరించింది.
వీటితో పాటు మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించగా.. వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నుంచి, ఇతరత్రా మరో వంద దాకా అర్జీలు వచ్చాయి. వీటన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసిన కమిషన్.. ఆ అంశాలనునివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ముఖ్యంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా జనాభా లెక్కలను కులాలతో సహా పొందుపరచడం విశేషం.
అర్బన్ రిపోర్టు అందుకే లేట్.
ఫిబ్రవరి రెండో వారంలో గానీ, మార్చి మొదటి వారంలో గానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది. ఒకవేళ ఆలోగా ఎన్నికలు నిర్వహించలేకపోతే మార్చి, ఏప్రిల్మొదటి వారంలో జరిగే వివిధ పరీక్షల కారణంగా మళ్లీ వేసవి సెలవుల్లో అంటే మేలోనే ఎలక్షన్స్ నిర్వహించాల్సిన పరిస్థితి! మరోవైపు ఫిబ్రవరి 1తో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది పూర్తవుతున్నందున అదే నెల రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి.. వీలైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ఎన్నికలను ఏప్రిల్, మేలో నిర్వహించాలన్నది సర్కార్ ఆలోచనగా కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం డెడికేటెడ్కమిషన్దృష్టికి తీసుకెళ్లడంతో కమిషన్ఆ మేరకు రెండు భాగాలుగా సర్కార్ కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కులగణన సర్వే రిపోర్ట్పూర్తిస్థాయిలో కమిషన్‌కు అందినప్పటికీ, అర్బన్ ఏరియాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ఇంకా పూర్తిస్థాయిలో చేరనట్టు తెలుస్తున్నది.
దీనికితోడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనాలు, వార్డుల్లో మార్పుచేర్పులకు సంబంధించి కూడా కొన్ని వివరాలు రావాల్సి ఉంది. దీంతో ఇప్పటికే దాదాపు పూర్తయిన రూరల్లోకల్బాడీలకు సంబంధించిన రిపోర్ట్సర్కారుకు అందజేసి.. ఆ తర్వాత మరో వారం, పది రోజుల్లో అర్బన్రిపోర్ట్ను అందజేయాలని బీసీ కమిషన్నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,845 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిల్లో 1,13,328 వార్డులు ఉన్నాయి. దీంతో ఆయా పంచాయతీలు, వార్డుల యూనిట్‌గా కులాల వారీ జనాభా వివరాలను కమిషన్ సిద్ధం చేసింది. ఆ లెక్కల ఆధారంగానే ఏయే పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ, జడ్పీలు బీసీలకు కేటాయించాలో సర్కారుకు స్పష్టమైన సిఫార్సు చేయనున్నట్టు కమిషన్‌వర్గాలు వెల్లడించాయి.
లోకల్ బాడీ ఎన్నికలపై వ్యూహాత్మకంగా అడుగులు..
తర్వలో జరగనున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఈ మూడింటిలో ఏ ఎన్నికలు ముందు జరపాలనే దానిపై తర్జనభర్జనల తర్వాత ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. సర్పంచ్ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు అలా కాదు. ఇవి పూర్తిగా పార్టీ గుర్తులపైనే నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు 2030 దాకా పవర్లో ఉంటారు. అందువల్ల ఈ లోకల్బాడీల్లో పార్టీల గెలుపోటములు 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ ఎన్నికలను అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
కాగా, ఈ నెల 26న ప్రభుత్వం రైతుభరోసా సహా నాలుగు స్కీములను ప్రారంభిస్తున్నది. అందువల్ల మొదట పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలనే నిర్వహించాలని ప్రభుత్వంపై పలురకాల ఒత్తిళ్లు వచ్చాయి. కానీ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయితీ రాజ్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతరత్రా పోలింగ్సామగ్రి సిద్ధం చేశారు. కేవలం బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేక పంచాయతీ ఎన్నికలను ఆపుతున్నారు తప్ప వేరే కారణం లేదు. వారం రోజుల్లో బీసీ కమిషన్ సైతం తొలిదఫా రూరల్రిపోర్ట్ఇచ్చేందుకు సిద్ధమైంది. అర్బన్ రిపోర్ట్వచ్చేందుకు మరింత టైమ్ పడుతుంది. దీంతో సర్కార్ ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకే మొగ్గుచూపుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.