హైదరాబాద్, వెలుగు: బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, వారిపై ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. హైదరాబాద్ లోని బీసీ భవన్ లో బీసీటీఏ డైరీ, క్యాలెండర్ను ఆ సంఘం నేతలతో కలిసి ఆయన రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా బీసీటీఏ స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణుడు నేతృత్వంలోని ఆ సంఘం ప్రతినిధులు కృష్ణయ్యకు వినతిపత్రం అందించారు. బీసీల రిజర్వేషన్లకు కావాల్సిన చదువు కోసం వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, క్రిమిలేయర్ విధానం ఎత్తివేయాలని వారు కోరారు. జీవో 317తో చాలా మంది టీచర్లు, ఉద్యోగులకు స్థానికత లేకుండా పోయిందని, ఈ జీవోలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా జిల్లాలను కేటాయించడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని బీసీటీఏ నేతలు కోరారు.