బీసీ రిజర్వేషన్ల కోసం నేడు బీసీ పోరు గర్జన

బీసీ రిజర్వేషన్ల కోసం నేడు బీసీ పోరు గర్జన
  • జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
  • ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్​, మంత్రులు పొన్నం, సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు
  • బీసీ బిల్లులను పార్లమెంట్​లో ఆమోదించి, 9 వ షెడ్యూల్​లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్న నేతలు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో పాస్​ అయిన బీసీ బిల్లులకు పార్లమెంట్​ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై బీసీ సంఘాల నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది.  బీసీలకు 42 శాతం కోటా కోసం బీసీ సంఘాల నేతలు, మేధావులతోపాటు  సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు.  స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను  పార్లమెంట్​లో ఆమోదించి, తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చాలనే డిమాండ్​తో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్​ వద్ద  ‘బీసీల పోరు గర్జన’ నిర్వహించనున్నారు.

ఈ ఆందోళనలో పాల్గొనేందుకు సోమవారం  ప్రత్యేక రైలులో బయలుదేరిన  వేలాది మంది బీసీ నేతలు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు.  మంగళవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ విమానంలో ఢిల్లీ వెళ్లారు. వారి వెంట ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, దాదాపు 15 మంది బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నేతలు ఉన్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగిన నేతలు.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరోవైపు సీఎం రేవంత్ సైతం ఈ ఆందోళన లో పాల్గొనేందుకు విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. నేడు, రేపు కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీలోనే ఉండి.. బీసీల రిజర్వేషన్ల అంశంపై కేంద్ర మంత్రులను
కలవనున్నది. 

బీజేపీది ద్వంద వైఖరి: బీసీ నేత జాజుల

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర సర్కారు అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లులకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారని, అయితే,  ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్రనేతలు మాత్రం మతపర రిజర్వేషన్లు కల్పించమంటూ అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. జాతీయ పార్టీ అంటే ఒకే వైఖరి ఉండాలని, గల్లీలో ఒకలా.. ఢిల్లీలో మరోలా ఉండకూడదని హితవు పలికారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జాజుల నేతృత్వంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, దేశవ్యాప్తంగా జన గణనలో కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని జాజుల డిమాండ్ చేశారు. 

లేకుంటే మరో మండల్ కమిషన్ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.  చలో ఢిల్లీ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ తో సహా పార్లమెంట్ లో గుర్తింపు పొందిన 26 రాజకీయ పార్టీలను ఆహ్వానించామని చెప్పారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, బీసీ సంక్షేమమే తమ అజెండా అని క్లారిటీ ఇచ్చారు. తమ ఆందోళనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిపారు.  నిజంగా బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే..  ఓబీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ.. ఈ బిల్లులను 9 వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే ఈ మహా ధర్నాను బీజేపీ ధన్యవాద సభగా మార్చుతామని చెప్పారు.