
- 6,832 బ్యాక్ లాగ్ సీట్లకు 26,884 అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ గురుకుల స్కూళ్లల్లో 2025~-26 అకడమిక్ ఇయర్ కు ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతుల సీట్లను భర్తీ చేయడానికి ఈ నెల 20న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 6,7,8,9 వ క్లాసుల్లో మొత్తం 6,832 బ్యాగ్ లాగ్ సీట్లు ఉండగా.. 26,884 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు.
20న ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటికే అభ్యర్థులందరూ హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఇంకా హల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోని వాళ్లు వెంటనే www.mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org వెబ్‌సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని సైదులు పేర్కొన్నారు.